Breaking News

4 రోజుల్లోనే రూ.33 వేల కోట్ల విలువైన షేర్లు అమ్మేసిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ .. కారణం ఇదే?

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన, ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వరుసపెట్టి తన అమెజాన్ షేర్లను అమ్ముకుంటున్నారు. జెఫ్ బెజోస్ కేవలం 4 ట్రేడింగ్ సెషన్లలోనే 24 మిలియన్ల షేర్లను అమ్మేయడం గమనార్హం. రానున్న 12 నెలల్లో మొత్తంగా 5 కోట్ల వరకు షేర్లను విక్రయించాలని బెజోస్ ప్లాన్ అని తెలుస్తోంది. గతంలోనే దీనిపై జెఫ్ బెజోస్ ప్రకటన చేశారు.


Published on: 14 Feb 2024 11:25  IST


దిగ్గజ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్  అధినేత జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా 24 మిలియన్ల షేర్లను  విక్రయించారు.  ఈ సేల్ కారణంగా  జెఫ్ బెజోస్ కు ఏకంగా 4 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో సుమారు రూ. 33 వేల కోట్లకుపైనే ఆదాయం సమకూరింది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. 2021 తర్వాత అమెజాన్ ఫౌండర్ షేర్లను అమ్మేయడం ఇదే తొలిసారి. రానున్న సంవత్సరంలో అంటే 2025 కల్లా మొత్తం 5 కోట్ల వరకు అమెజాన్ షేర్లను విక్రయించాలనే దాని గురించి   జెఫ్ బెజోస్ గతంలోనే ప్రకటన చేశారు. దానికి తగ్గట్లుగానే వరుసపెట్టి  షేర్లను అమ్మేస్తున్నారు.

5 కోట్ల షేర్లను విక్రయించాలనుకున్న జెఫ్  బెజోస్.. ఇప్పుడు కేవలం 4 రోజుల వ్యవధిలోనే దాంట్లో సగం వరకు 2.40 కోట్ల షేర్లను విక్రయించడం గమనార్హం. అమెజాన్ షేర్లు ఇటీవలి కాలంలో రాణించింది. ఈ కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు అమెజాన్  షేర్లు 13 శాతం వరకు పుంజుకుంది. అయితే జెఫ్ బెజోస్ షేర్లు అమ్మేసినట్లు ప్రకటన వచ్చిన తర్వాత ఫిబ్రవరి 13న ఒక్కరోజే 2 శాతానికిపైగా పడిపోయింది.  ప్రస్తుతం ఈ స్టాక్ ధర 168.64 యూఎస్ డాలర్ల వద్ద ఉన్నది. అమెజాన్ ఆదాయం గత కొంత కాలంగా పుంజుకుంటోంది, ముఖ్యంగా కరోనా తర్వాత కాలంలో ఆన్‌లైన్ సేల్స్ ఊపందుకున్నాయి. ఫిబ్రవరి 12న షేర్ల విలువ దాదాపు 8 శాతం వరకు పెరిగి 172 డాలర్లకు చేరింది. దీంతో  జెఫ్ బెజోస్ ఒక్కరోజే 12.1 బిలియన్ డాలర్లు ఆర్జించారు. తర్వాత షేర్లు అమ్మిన తర్వాత సంపద 3 బిలియన్ డాలర్ల వరకు పడిపోయింది.
ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ ధనవంతుల జాబితాలో జెఫ్  బెజోస్ 193 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ 202 బిలియన్ డాలర్లతో ఉన్నారు. ఇద్దరి మధ్య తేడా 9 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. 2021కి ముందు జెఫ్ బెజోస్ ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి