Breaking News

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు చూడటానికి వింతగా ఉన్నా అవి ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. అటువంటి విశిష్టమైన గిరిజన సంస్కృతికి నాగోబా జాతర అద్దంపడుతోంది.

రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ఈ నాగోబా జాతర గుర్తింపు పొందింది. ఇంద్రవెల్లి మండలం కేస్లపూర్ లో కొలువై ఉన్న నాగోబా కు మెస్రం వంశ గిరిజనులు పుష్య అమావాస్య రోజు చేసిన అభిషేకం, మహాపూజతో ఈ జాతర మొదలైంది. ప్రతీ సంవత్సరం గిరిజనులు పుష్యమాసంలో జరుపుకునే అతి పెద్ద మహోత్సవం ఇది.

మెస్రం వంశ కొత్త కోడళ్లకు గిరిజన పెద్దలు కొత్త కుండలు అందజేయగా, వారంతా ఆలయ సమీపంలో ఉన్న కోనేరు వద్దకు వెళ్ళి కుండల్లో నీళ్లు తీసుకొని వరుసగా నడుచుకుంటూ వచ్చి గోవాడ ప్రవేశం చేశారు.

గోవాడకు చేరుకున్న మహిళలకు కోనేటి నీటితో శుద్ది చేసి, నవ ధాన్యాలతో నైవేద్యం తయారు చేశారు. సతీ దేవతలకు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం సామూహిక భోజనాలు చేసి ఉపవాస దీక్షను విరమించారు.

ఆలయ ఆవరణలో నీటితో శుద్ది చేసి మట్టి తవ్వి పుట్టను తయారు చేశారు. అనంతరం పుట్టకు సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. ఇతర దేవతలను కూడా శుద్ది చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జాతరలో భాగంగా గిరిజనులు ఆనవాయితీగా వస్తున్న భేటింగ్ కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. తమ ఇంటి కొత్త కోడళ్లను కుటుంబ పెద్దలు దైవాలకు పరిచయం చేసే కార్యక్రమాన్నే భేటింగ్ అంటారు. ఈసారి 202 మంది కొత్త కోడళ్లు అర్ధరాత్రి నుండి తెల్లవారు జాము వరకు భేటింగ్ నిర్వహించారు.

ఈ నాగోబా జాతరకు వివిధ ప్రాంతాల నుండి మెస్రం వంశ గిరిజనులు తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చిన అతిథులను మెస్రం వంశస్థులు సత్కరించి నాగోబా చిత్రపటాన్ని బహూకరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజలు జాతర సందర్భంగా ఆలయానికి వచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు.