Breaking News

జల సంరక్షణతోనే భవిష్యత్తుకు భరోసా...

నీటి వనరులను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జల సంరక్షణపై అవగాహన పెంపు అవసరమని తెలిపారు.


Published on: 08 Apr 2026 17:34  IST

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీటి వనరుల ప్రాముఖ్యతపై స్పష్టంగా వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కానూరులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్వహించిన ‘గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం’పై ఒక రోజు కార్యశాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. నీరు ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి గోదావరి, కృష్ణా, పెన్నా, వంశదార వంటి నదులు కీలకమని తెలిపారు. ప్రస్తుతం నీటి వనరులను కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు.

రోజురోజుకు తగ్గుతున్న భూగర్భ జలాల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీటిని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్టేనని హెచ్చరించారు. ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి చొప్పించడం, వాగులు, వంకలు, నదుల ద్వారా వృథాగా సముద్రంలోకి వెళ్లే నీటిని నిల్వ చేసుకునే చైతన్యం కలగాలని సూచించారు. నీటి వినియోగంలో మార్పులు తీసుకురావడం అవసరమని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల నీటి వినియోగ కార్యక్రమం ఏప్రిల్ నుంచి జులై 14 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో భూగర్భ జలాల పెంపు, నీటి వృథాను అడ్డుకోవడం, నీటిని పునర్వినియోగించుకోవడం, వర్షపు నీటిని సేకరించడం వంటి చర్యలు ఉంటాయని వివరించారు. అలాగే నీటి వనరుల సంరక్షణకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఏజెన్సీ, గిరి ప్రాంతాల్లో వేసవిలో తలెత్తే నీటి సమస్యలను పరిష్కరించేందుకు వాటర్ షెడ్ల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతను వినియోగించి నీటి కొరతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి కుటుంబానికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో జల్ జీవన్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్తామని, నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

 

Follow us on , &

ఇవీ చదవండి