Breaking News

చీర కట్టుకుని వెళ్లడమే నా పాపమైంది.. అతడి భార్య, బిడ్డ గురించి ఆలోచించా.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫార్మసీ విద్యార్థిని లేఖ

రాజమహేంద్రవరంలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. యువతి బీ ఫార్మాసీ చదువుతూ ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది.అయితే ఆమె ఓ లేఖ రాసి మత్తు మందు ఎక్కువ డోస్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.


Published on: 27 Mar 2025 17:12  IST

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన ఓ కౌలు రైతు దంపతులకు పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత ఓ కుమార్తె జన్మించింది. ఏకైక సంతానం కావడంతో ఆమెను బాగా చదివించాలని తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ప్రస్తుతం యువతి రాజమహేంద్రవరంలోని ఓ ఫార్మసీ కాలేజీలో ఫార్మ్ బీ చివరి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు నగరంలోని ఓ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్టుగా పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది.ఆసుపత్రిలో పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. అతను పెళ్లి చేసుకుంటా అని మాటలు చెప్పి నమ్మించి, చివరికి మోసం చేశాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు అతను యువతిని అసభ్యకర ఫోటోలు ఉన్నాయి.. వాటిని బయట పెడతానంటూ బెదిరించాడు.

ఈ నెల 23న ఆసుపత్రికి విధులకు వెళ్లిన యువతి, తీవ్ర మనస్తాపానికి గురై ఓ మత్తుమందును ఎక్కువ మోతాదులో ఎక్కించుకోవడంతో.ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన తెలిసిన వెంటనే ఫార్మసీ కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసులు స్పందించి దీపక్‌ను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, దీపక్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. యువతి ఫోన్ అతని దగ్గరే ఉండడంతో, డేటా కూడా డిలీట్ చేశాడని ఆమె సోదరి ఆరోపించారు.

యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. ఆమె తన ఆత్మహత్యాయత్నానికి ముందు ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, 'అమ్మ.. నాన్నా.. క్షమించండి. తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నా. ఆఖరికి నేను చదువుకున్న చదువు నేను చనిపోవడానికే అన్న సంగతి గ్రహించలేకపోయా.అలాగే జీవితమంతా నాశనం చేసుకుని ఏడవడానికి కూడా ఓపిక లేదు.ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఇంటికి వెళ్లే ధైర్యం లేదు. ఎన్నో కలలు కన్నా. ఓ ఫంక్షన్‌కు చీర కట్టుకుని వెళ్లడమే నా పాపమైంది. ఆ మోసగాడి కన్ను నాపై పడింది..నాకు వేరే దారిలేక చనిపోతున్నా. ఆడపిల్లలకు రక్షణ లేదు. నన్ను ఎంత కొట్టినా, తిట్టినా ఓపికగా భరించా. ఇక తట్టుకునే శక్తి లేదు. అతడు చాలా లైంగికంగా వేధించాడు. అతడి భార్య, బిడ్డ గురించి ఆలోచించి నోరు తెరవలేదు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గొంతు కోశాడు.ఎంతో కుమిలిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా. ఓ ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు.నా అవయవాలను ఇతరులకు దానం చేయండి" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి