Breaking News

అమరావతి’కి సహకరిస్తాం.. ఏపీ కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలు: మోదీ

రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు మీ నాయకుల వెంట నేను కూడా ఉంటాను అని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


Published on: 02 May 2025 18:38  IST

అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ – "అమరావతి ఒక నగరం మాత్రమే కాదు, అది అభివృద్ధికి నూతన శక్తి," అని వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధనకు ఇది మంచి సంకేతమని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా తోడ్పడుతుందని స్పష్టం చేశారు. అమరావతిలో పునర్నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు అనుభవం, విజన్‌ను మోదీ కొనియాడారు. “ఐటీ రంగ అభివృద్ధికి హైదరాబాద్‌ను ఎలా మలిచారో దేశం చూసింది. పెద్ద ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఆయనకంటె మెరుగైన నాయకుడు దేశంలో లేరు,” అని పేర్కొన్నారు. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం సహకారం అందించిందని, ఇకపై మరింత మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.

పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ – "ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో మనమంతా కలిసి పనిచేయాలి," అని ప్రధాని అన్నారు. ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాల్సిన బాధ్యత అందరిమీదా ఉందని చెప్పారు.

ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విద్యా రంగాలు, ఆరోగ్య సేవల కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయాలన్నదే కేంద్ర ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రానికి ప్రాజెక్టుల రూపంలో కేంద్రం రూ.60,000 కోట్లకు పైగా మద్దతు ఇస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో కనెక్టివిటీ పెంచేందుకు చేపడుతున్న రైలు, రోడ్డు ప్రాజెక్టుల వల్ల పర్యాటకం, ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమల రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణతో పాటు, వందేభారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు రాష్ట్రానికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

రైతుల సంక్షేమం కోసం రూ.17,000 కోట్ల మేర సాయం అందించిన కేంద్రం, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్రంతో కలిసి పనిచేస్తుందని మోదీ తెలిపారు.
రక్షణ, అంతరిక్ష రంగాల్లో రాష్ట్రం పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు. నాగాయలంకలో టెస్టింగ్ రేంజ్‌, శ్రీహరికోట నుంచి ప్రయోగాలన్నీ దేశ గర్వకారణాలుగా అభివర్ణించారు.

జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటానని వెల్లడించిన ప్రధాని, రాష్ట్రానికి అభినందనలు తెలిపారు.
“రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు మీ నాయకుల వెంట నేను కూడా ఉంటాను. అమరావతి పూర్తయిన తర్వాత ఆర్థికాభివృద్ధిలో ఏపీ కొత్త గరిష్టాలను చేరుతుంది” అని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి