Breaking News

కమల్, రజనీకి సాధ్యం కానిది విజయ్ ఎలా సాధించాడు?

తమిళనాడులో ఇతర స్టార్‌లకు సాధ్యం కాని రాజకీయ విజయాన్ని విజయ్ ఎలా సాధించాడన్నదానిపై విశ్లేషణ.


Published on: 05 May 2026 15:29  IST

తమిళనాడులో సినిమా, రాజకీయాలు విడదీయలేని సంబంధంగా కొనసాగుతున్నాయి. గతంలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి నేతలు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా నిలిచారు. అనంతరం కూడా పలువురు నటులు రాజకీయాల్లోకి వచ్చినా, అందరూ ప్రజాదరణను ఓట్లుగా మార్చుకోవడంలో సఫలం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్‌లకు సాధ్యం కానిది విజయ్ ఎలా సాధించాడన్నది ఆసక్తికర చర్చగా మారింది.

విజయ్ చాలా ముందుగానే తన అభిమాన సంఘాలను బలమైన నెట్‌వర్క్‌గా మార్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది అభిమాన సంఘాలు దాదాపు ఒక రాజకీయ సంస్థలా పనిచేస్తూ, సామాజిక సేవలో పాల్గొన్నాయి. ఈ నెట్‌వర్క్ 2021 స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం విజయ్‌కు రాజకీయంగా ముందడుగు వేయడానికి ధైర్యం ఇచ్చింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం పెంచుకోవడం ఆయనకు ప్రధాన బలం అయ్యింది.

ఇంకా విజయ్ వయసు, యువతలో ఉన్న ప్రభావం కూడా కీలక పాత్ర పోషించాయి. యువ ఓటర్లను ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో చురుకైన ప్రచారం నిర్వహించారు. జెన్ జెడ్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనకు పెద్ద ఎత్తున యువ మద్దతు లభించింది. దీంతో ఆయన రాజకీయ ప్రయాణానికి బలమైన పునాది ఏర్పడింది.                                                                                 

అదే సమయంలో ద్రవిడ పార్టీలకు భిన్నంగా తన పార్టీని ప్రొజెక్ట్ చేయడం విజయానికి కారణమైంది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రధాన పార్టీలపై విమర్శలు చేస్తూ ప్రత్యామ్నాయంగా నిలిచారు. సినిమాలను పక్కనపెట్టి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టడం, భావోద్వేగాలతో కూడిన ప్రచారం చేయడం, సంక్షేమ హామీలు ఇవ్వడం  ఈ అంశాలన్నీ కలిసి విజయ్‌ను తక్కువ సమయంలోనే బలమైన రాజకీయ నాయకుడిగా నిలిపాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement