Breaking News

సంక్షోభ నివారణా.. అతిజోక్యమా?

తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంతో గవర్నర్ నిర్ణయంపై రాజకీయ, రాజ్యాంగ చర్చలు మొదలయ్యాయి.


Published on: 08 May 2026 12:00  IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. అత్యధిక స్థానాలు సాధించిన Vijay నేతృత్వంలోని టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు వెంటనే ఆహ్వానించకపోవడంతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నిర్ణయం చర్చనీయాంశమైంది. మెజారిటీకి సరిపడా ఎమ్మెల్యేల మద్దతు తీసుకురావాలని గవర్నర్ సూచించడంతో రాజకీయ వర్గాల్లో విమర్శలు, మద్దతు రెండూ వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అతిపెద్ద పార్టీకి మొదటి అవకాశం ఇవ్వాల్సిందని టీవీకే వర్గాలు అంటుండగా, మరోవైపు సంఖ్యా బలం స్పష్టంగా లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం ప్రమాదకరమని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. 1996లో కేంద్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం 13 రోజుల్లోనే లోక్‌సభలో మెజారిటీ నిరూపించుకోలేక కూలిపోయింది. ఈ ఘటన తర్వాత అతిపెద్ద పార్టీని మాత్రమే ఆధారంగా తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆహ్వానం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఆ తరువాత 1998 లోక్‌సభ ఎన్నికల్లో కూడా హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు. మద్దతు ఇస్తున్న పార్టీల నుంచి లేఖలు తీసుకుని, సంఖ్యా బలం స్పష్టమైన తర్వాతే బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. జయలలిత అన్నాడీఎంకే సహా మిత్రపక్షాల మద్దతుతో ఏర్పడిన ఆ ప్రభుత్వం 13 నెలలు కొనసాగింది. ఈ ఉదాహరణలను ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తావిస్తున్నారు.

2018లో కర్ణాటకలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మెజారిటీని ప్రకటించింది. అయినప్పటికీ అప్పటి గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా, అసెంబ్లీలో బలపరీక్షకు ముందే ప్రభుత్వం కూలిపోయింది. 2019 మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం నాలుగు రోజుల్లోనే పడిపోయింది. ఈ రెండు సంఘటనలను ఇప్పుడు తమిళనాడు రాజకీయ పరిణామాలతో పోలుస్తున్నారు.

సర్కారియా, పూంచీ కమిషన్లు కూడా గవర్నర్లు ప్రభుత్వం ఏర్పాటు విషయంలో పాటించాల్సిన ప్రాధాన్యతా క్రమాన్ని సూచించాయి. ముందుగా ఎన్నికల ముందే ఏర్పడిన కూటములకు, ఆ తర్వాత అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వాలని అవి పేర్కొన్నాయి. ఎన్నికల తర్వాత కూటములు ఏర్పడి మెజారిటీ నిరూపిస్తే వారినీ పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించాయి. అవసరమైతే మద్దతు లేఖలను గవర్నర్ స్వయంగా పరిశీలించాలని కూడా పూంచీ కమిషన్ సిఫార్సు చేసింది.

ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఏ పార్టీకి మెజారిటీ ఉందో లేదో నిర్ణయించేది రాజ్‌భవన్ కాదని, అసెంబ్లీ మాత్రమే తుది నిర్ణయ వేదిక అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల సంతకాల కంటే అసెంబ్లీలో జరిగే బలనిరూపణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. అలాగే కొత్త ప్రభుత్వాలకు ఎక్కువ గడువు ఇవ్వకుండా వీలైనంత త్వరగా బలపరీక్ష నిర్వహించాలని కూడా సూచించింది.

ఈ మొత్తం పరిణామాల మధ్య తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. టీవీకేకు అవసరమైన మద్దతు లభిస్తుందా? డీఎంకే-అన్నాడీఎంకే లేదా ఇతర కూటములు కొత్త సమీకరణాలు సృష్టిస్తాయా? లేక పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుందా? అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి