Breaking News

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో కొందరు వ్యక్తులు దాడి చేశారు

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటన జూన్ 15, 2026 న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం వంటి సమస్యలపై జరిగిన నిరసన ప్రదర్శనలో చోటుచేసుకుంది.


Published on: 16 Jun 2026 18:53  IST

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటన జూన్ 15, 2026 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం వంటి సమస్యలపై జరిగిన నిరసన ప్రదర్శనలో చోటుచేసుకుంది.

జైపూర్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద విద్యావ్యవస్థలో గందరగోళానికి వ్యతిరేకంగా CJP భారీ నిరసనను చేపట్టింది.అభిజిత్ దీప్కే నిరసన ప్రాంతానికి చేరుకున్నప్పుడు, మద్దతుదారులు ఆయనను తమ భుజాలపై ఎక్కించుకుని తీసుకెళ్తుండగా, గుంపులో ఉన్న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకొచ్చారు.సదరు వ్యక్తులు అభిజిత్‌ను కాలర్‌ పట్టుకుని లాగుతూ, ఆయన చెంపపై వరుసగా నాలుగైదు సార్లు బలంగా కొట్టారు.వెంటనే స్పందించిన CJP కార్యకర్తలు, దాడి చేసిన వ్యక్తులను పట్టుకుని అక్కడే దేహశుద్ధి చేశారు. దీనితో ఆ ప్రాంతంలో కాసేపు తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది.

నిరసన స్థలంలో ఉన్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి గొడవను అదుపులోకి తెచ్చారు.అభిజిత్ దీప్కేపై దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.దాడి చేసిన వారిలో ఒకరిని రాకేష్ గుర్జర్ అని గుర్తించారు. తాను "దేశభక్తుడినని", అభిజిత్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే దాడి చేశానని అతను సమర్థించుకున్నాడు.

దాడి అనంతరం అభిజిత్ తన సోషల్ మీడియా 'X' ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు."భౌతిక దాడులు అనేవి ప్రత్యర్థుల భయానికి నిదర్శనం. మా గొంతును నొక్కేందుకు మరియు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ పిరికిపందల దాడికి పాల్పడ్డారు" అని ఆయన మండిపడ్డారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే తమ ప్రధాన డిమాండ్ నుండి కార్యకర్తలు ఎవరూ పక్కకు తప్పుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి