Breaking News

కేంద్ర ప్రభుత్వం మరోసారి పాక్‌కు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టా ఖాతాలను గురువారం ఉదయం నుంచి దేశంలో నిలిపివేసినట్టు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం మరోసారి పాక్‌కు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టా ఖాతాలను గురువారం ఉదయం నుంచి దేశంలో నిలిపివేసినట్టు సమాచారం.


Published on: 03 Jul 2025 09:41  IST

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు చెందిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను భారత్‌లో తాత్కాలికంగా నిలిపివేసిన కేంద్రం, ఆ తర్వాత ఆ ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. దీని కారణంగా కొన్ని పాకిస్థానీ సెలబ్రిటీల ఖాతాలు యూట్యూబ్‌లో మళ్లీ కనిపించగా, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అయితే, ఈ పరిణామం భారతీయ నెటిజన్లలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. సోషల్ మీడియా వేదికల్లో ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ ఖాతాలపై మళ్లీ నిషేధాన్ని కొనసాగించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి చొరవ తీసుకుని పాక్‌కు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టా ఖాతాలను దేశంలో నిలిపివేసినట్టు సమాచారం. గురువారం ఉదయం నుంచి వీటిని భారత్‌లో బ్లాక్ చేసినట్లు తెలిసింది. అయితే, ఈ చర్యపై ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన తరుణంలో, పాక్‌కు చెందిన కొన్ని మీడియా సంస్థల యూట్యూబ్ ఛానళ్లతో పాటు సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం అప్పట్లో తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఈ నిషేధిత ఖాతాల్లో పాక్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిది వంటి ప్రముఖుల యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని సమాచారం. అంతేకాదు, పాక్ రక్షణ శాఖకి సంబంధించిన అధికారిక ఖాతా, ఆ దేశ ప్రధాని యూట్యూబ్ ఛానల్‌ కూడా బ్లాక్‌ చేయబడ్డాయి. ఇంకా పాక్‌కు చెందిన పలువురు నటీనటులు, క్రీడాకారుల సోషల్ మీడియా ఖాతాలు కూడా ఈ బ్లాక్‌ జాబితాలోకి వచ్చాయి.

ఈ చర్యకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రధాన కారణం — ఈ ఛానళ్ల ద్వారా పహల్గాం దాడిపై తప్పుడు సమాచారాన్ని, దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా సమాచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడమే. అదనంగా, భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పైనూ అసత్య ప్రచారాలను వినియోగదారులకు చేర్చడమే ఈ చర్యకు కారణంగా పేర్కొనబడింది.

ఇటువంటి యూట్యూబ్, ఇన్‌స్టా ఖాతాలను భారతదేశం నుంచి యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే, “ఈ కంటెంట్‌ ప్రస్తుతం భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుబాటులో లేదు” అనే సందేశం కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే, జాతీయ భద్రతపై దృష్టి పెట్టి కేంద్రం మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి