Breaking News

భారత మహిళల చరిత్రాత్మక గెలుపు – ప్రపంచకప్‌పై త్రివర్ణ పతాకం!

భారత మహిళల చరిత్రాత్మక గెలుపు – ప్రపంచకప్‌పై త్రివర్ణ పతాకం!


Published on: 03 Nov 2025 10:46  IST

మన దేశ మహిళల క్రికెట్‌ రూపురేఖలు గత కొన్నేళ్లలో విపరీతంగా మారిపోయాయి. ఒకప్పుడు అభిమానులు పెద్దగా పట్టించుకోని ఈ ఆటకు ఇప్పుడు విశేష గుర్తింపు వచ్చింది. స్టేడియాల్లో ప్రేక్షకుల హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. టెలివిజన్, సోషల్ మీడియాలో మహిళల క్రికెట్‌ చర్చకు కేంద్రంగా మారింది. కానీ ఇంత ప్రగతి సాధించినప్పటికీ, ఇప్పటివరకు ‘కపిల్స్‌ డెవిల్స్‌’ 1983లో చేసినట్లు ఒక చారిత్రాత్మక విజయం మాత్రం అందలేదు. ఆ ఎదురు చూపులకు, ఆ నిరీక్షణకు చివరికి ముగింపు లభించింది — హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత మహిళల జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది!

ఫైనల్లో అద్భుత ప్రదర్శన – అమ్మాయిల ‘83’!

సొంత గడ్డపై, వేలాది అభిమానుల ముందే భారత మహిళా జట్టు అద్భుతంగా రాణించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. షెఫాలి వర్మ (87 పరుగులు), దీప్తి శర్మ (58 పరుగులు, 5 వికెట్లు) అద్భుత ప్రదర్శనతో జట్టుకు వెన్నుదన్నుగా నిలిచారు. స్మృతి మంధాన, రిచా ఘోష్‌ కూడా విలువైన ఇన్నింగ్స్‌లతో సహకరించారు.

బౌలింగ్‌లో దీప్తి మాయాజాలం, షెఫాలి బౌలింగ్‌లో సర్ప్రైజ్‌ దాడి దక్షిణాఫ్రికా జట్టును తలదించుకునేలా చేశాయి. కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ (101 పరుగులు) ధైర్యంగా పోరాడినా, భారత్‌ గెలుపును అడ్డుకోలేకపోయింది.

షెఫాలి మలుపు తిప్పిన క్షణం!

దక్షిణాఫ్రికా జట్టు మొదట బలమైన ఆరంభం చేసింది. కానీ షెఫాలి అనూహ్యంగా బౌలింగ్‌లోకి రావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. వరుస ఓవర్లలో కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కుదిపేసింది. దీప్తి తన స్పెల్‌లో వికెట్ల వర్షం కురిపించింది. ముఖ్య సమయాల్లో లారా, డెర్క్‌సెన్‌, ట్రయాన్‌, డిక్లెర్క్‌లను ఔట్‌ చేయడంతో భారత్‌ విజయాన్ని సురక్షితం చేసింది.

బ్యాటింగ్‌లో షెఫాలి జోరు – దీప్తి స్థిరత్వం

మ్యాచ్‌ ప్రారంభం నుంచే షెఫాలి దూకుడు ఆటతో ఆకట్టుకుంది. స్మృతి మంధానతో కలిసి అద్భుత భాగస్వామ్యం అందించింది. ఆమె 49 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసింది. షెఫాలి, స్మృతి ఔటైన తర్వాత భారత్‌ కొంచెం కష్టాల్లో పడింది. కానీ ఆ దశలో దీప్తి శర్మ కీలక ఇన్నింగ్స్‌ ఆడి, జట్టును నిలబెట్టింది. చివర్లో రిచా ఘోష్‌ కూడా దూకుడు ప్రదర్శనతో స్కోరును 298కు చేర్చింది.

దీప్తి సూపర్‌ స్టార్‌ – ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’!

బ్యాట్‌తోనూ, బంతితోనూ మ్యాచ్‌ను మార్చిన ఆటగాడు ఎవరో అంటే.. అది దీప్తి శర్మే. ఆమె అర్ధశతకం జట్టును కాపాడగా, బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేసింది. టోర్నమెంట్‌ మొత్తం 9 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు గెలుచుకుంది.

ఇదే అమ్మాయిల ’83’!

ఈ విజయం కేవలం ట్రోఫీ కాదు — భారత మహిళల క్రికెట్‌ చరిత్రలో ఒక మలుపు. సుదీర్ఘంగా ఎదురుచూసిన ప్రపంచకప్‌ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలో టీమ్‌ ఇండియా చూపిన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సమష్టి కృషి — ఇవన్నీ కలసి ఈ చారిత్రాత్మక ఘనతను సాధించాయి.

Follow us on , &

ఇవీ చదవండి