Breaking News

రేంజ్‌రోవర్‌ వదిలి.. ఫార్చ్యూనర్‌లో మోదీ, పుతిన్‌

రేంజ్‌రోవర్‌ వదిలి.. ఫార్చ్యూనర్‌లో మోదీ, పుతిన్‌


Published on: 05 Dec 2025 10:05  IST

దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత భారత్‌ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గురువారం రాత్రి పాలం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పుతిన్‌ను మోదీ ఆప్యాయంగా ఆహ్వానించారు. విమానాశ్రయం నుంచి ప్రధానమంత్రి నివాసం వరకూ ఇద్దరూ ఒకే వాహనంలో ప్రయాణించడం ప్రత్యేకంగా ఆకర్షించింది.

ఈ ప్రయాణంలో ప్రధాని మోదీ తనకు సాధారణంగా ఉపయోగించే ఖరీదైన రేంజ్ రోవర్‌ను పక్కన పెట్టి, టయోటా ఫార్చ్యూనర్‌లో పుతిన్‌ను తీసుకెళ్లడం చర్చకు దారి తీసింది. సాధారణంగా అత్యంత భద్రతతో ప్రయాణించే ఇద్దరు ప్రపంచ నేతలు ఒక సాధారణ ఎస్యూవీలో ప్రయాణించడం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. ఆశ్చర్యకరంగా రష్యా అధ్యక్షుడు కూడా తనకు ప్రత్యేకంగా ఉన్న ఆరస్ సెనేట్ లగ్జరీ కారును వినియోగించకుండా ఫార్చ్యూనర్‌కే అంగీకారం తెలిపారు.

ఈ వాహనం టయోటా ఫార్చ్యూనర్ సిగ్మా 4 మాన్యువల్ వెర్షన్‌కు చెందినది. ఇది మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ పొందిన బీఎస్-6 ప్రమాణాల కారు కాగా, ఇటీవలే, 2024లో రిజిస్టర్ అయినట్లు సమాచారం. దీర్ఘకాలికంగా వినియోగించుకునే ఫిట్‌నెస్ అనుమతి కూడా దీనికి ఉంది. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే సాధారణతను చాటుకునే విధంగా ఈ ప్రయాణం సాగిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

విమానాశ్రయం నుంచి పుతిన్, మోదీ నేరుగా లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీ పుతిన్ గౌరవార్థం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇరు నేతల మధ్య అనధికార చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం మోదీ–పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రక్షణ, శక్తి, వాణిజ్యం వంటి అంశాలతో పాటు అంతర్జాతీయ పరిస్థితులపై కూడా చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా భారత్–రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేసే పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Follow us on , &

ఇవీ చదవండి