Breaking News

ఆధునిక సాంకేతికతకు చిరునామా గిఫ్ట్ సిటీ :పైపులైన్లు, విద్యుత్తు తీగలు, చెత్తసేకరణకు భూగర్భ వ్యవస్థ

ఆధునిక సాంకేతికతకు చిరునామా గిఫ్ట్ సిటీ :పైపులైన్లు, విద్యుత్తు తీగలు, చెత్తసేకరణకు భూగర్భ వ్యవస్థ


Published on: 10 Dec 2025 10:45  IST

రోడ్లపై వేలాడే విద్యుత్ తీగలు కనిపించవు… మురుగునీటి పైపులు కళ్లకు కనిపించవు… ఇంటింటికి చెత్త బండ్లు రావాల్సిన అవసరమే లేదు. విద్యుత్, నీరు, చెత్త నిర్వహణ అన్నీ ఒకే కేంద్రీకృత వ్యవస్థ ద్వారా జరుగుతాయి. అలాగే ప్రతి ఇంటికి వేర్వేరుగా ఏసీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, మొత్తం భవనాలకూ ఒకే శీతలీకరణ వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ ఒకే చోట సాధ్యమవుతున్న నగరం గుజరాత్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ – గిఫ్ట్ సిటీ.

భారతదేశంలో ప్రపంచ వాణిజ్య అవసరాల కోసం రూపొందించిన తొలి స్మార్ట్ సిటీయే గిఫ్ట్ సిటీ. గాంధీనగర్, అహ్మదాబాద్ మధ్యలో సబర్మతి నది ఒడ్డున 886 ఎకరాల్లో ఈ నగరాన్ని అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల భవనాలు, కార్యాలయాలకు సమీపంలో నివాస ప్రాంతాలు, ఆధునిక మౌలిక వసతులతో ఈ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఆటోమేటెడ్ చెత్త నిర్వహణ వ్యవస్థ

గిఫ్ట్ సిటీలో దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి ఆటోమేటెడ్ వ్యర్థ నిర్వహణ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించే అవసరం లేదు. భవనాల లోపల ఉన్న ప్రత్యేక వ్యవస్థల ద్వారా చెత్తను నేరుగా పైప్‌లైన్‌లోకి పంపిస్తారు. వాక్యూమ్ టెక్నాలజీ సాయంతో చెత్తను ఒకే కేంద్రానికి చేరుస్తారు.

ఈ విధానంతో పాటు నీటి సరఫరా, విద్యుత్ పంపిణీ కోసం భారీ భూగర్భ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. నగర అవసరాల కోసం ఆధునిక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం కొనసాగుతుంది.

డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ప్రత్యేకత

గిఫ్ట్ సిటీని ప్రత్యేకంగా నిలబెట్టే మరో కీలక అంశం డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్. ఇక్కడ శుద్ధి చేసిన మురుగునీటిని సుమారు 5 డిగ్రీల వరకు చల్లబరిచి, ఎయిర్ కండిషనింగ్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. నగరమంతా ఏర్పాటు చేసిన కూలింగ్ పైప్‌లైన్ ద్వారా ప్రతి భవనానికి చల్లని వాతావరణాన్ని అందిస్తారు.

దీంతో భవనాల బయట సాధారణ ఏసీల్లో ఉండే అవుట్‌డోర్ యూనిట్లు అవసరం ఉండవు. ఇది నగర రూపురేఖలకు అందాన్ని చేర్చడమే కాకుండా కాలుష్యాన్ని కూడా తగ్గిస్తోంది. సాధారణ ఏసీలతో పోలిస్తే ఈ విధానం సుమారు 30 శాతం వరకు విద్యుత్ ఆదా చేస్తుంది.

భద్రతతో కూడిన యుటిలిటీ టన్నెల్

గిఫ్ట్ సిటీలో దేశంలోనే తొలి యుటిలిటీ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో విద్యుత్ లైన్లు, నీటి సరఫరా పైపులు, చెత్త నిర్వహణ వ్యవస్థ అన్నీ ఒకే మార్గంలో ఉంటాయి. దీంతో మరమ్మతులు లేదా నిర్వహణ పనుల కోసం రోడ్లను మళ్లీ మళ్లీ తవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం 5.8 కిలోమీటర్ల పొడవు గల యుటిలిటీ టన్నెల్ సేవల్లో ఉంది.

ఇలా ఆధునిక సాంకేతికతను, పర్యావరణ అనుకూల విధానాలను కలిపి నిర్మించిన గిఫ్ట్ సిటీ… భవిష్యత్ నగరవికాసానికి ఒక మోడల్‌లా మారుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి