Breaking News

ఉత్తర అట్లాంటిక్‌లో పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తత

ఉత్తర అట్లాంటిక్‌లో పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తత


Published on: 08 Jan 2026 10:46  IST

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తాజాగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా జెండాతో ప్రయాణిస్తున్న వెనెజువెలాకు చెందిన ఒక చమురు నౌకను, మరో గుర్తింపు లేని నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఈ చర్యకు బ్రిటన్ మద్దతు ఇవ్వడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.

అమెరికా ఆధీనంలోకి తీసుకున్న నౌక పేరు మ్యారినెరా. దీనికి గతంలో బెల్లా–1 అనే పేరు ఉండేది. మొదట ఈ నౌక గుయానా జెండాతో ప్రయాణించగా, ప్రమాదాన్ని గుర్తించిన తర్వాత రష్యా జెండాను ఎగురవేశారు. ఐస్‌లాండ్ దక్షిణ తీరానికి సుమారు 190 మైళ్ల దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ కలిసి ఈ నౌకను సీజ్ చేశాయి. దీనితో పాటు సోఫియా అనే మరో జెండా లేని నౌకను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా, బ్రిటన్ భారీ స్థాయిలో సైనిక బలగాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వినియోగించాయి. హెలికాప్టర్ల ద్వారా అమెరికా మెరీన్లు నౌకపై దిగుతూ, అందులోని సిబ్బందిని నియంత్రణలోకి తీసుకున్న దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. అనంతరం ఆ నౌకను అమెరికా దక్షిణ దిశగా మళ్లించారు.

వాస్తవానికి, ఈ నౌకకు రక్షణగా రష్యా ఇప్పటికే కొన్ని రోజుల క్రితమే తన నౌకాదళాన్ని పంపినట్టు సమాచారం. అమెరికా ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో రష్యా నౌకలు సమీపంలోనే ఉన్నప్పటికీ, అమెరికా తన చర్యను విజయవంతంగా పూర్తి చేసింది.

మ్యారినెరా నౌకపై అమెరికా 2024లోనే ఆంక్షలు విధించింది. ఈ నౌక లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మిలిటెంట్లకు ఆయుధాలు సరఫరా చేస్తోందని అప్పట్లో అమెరికా ఆరోపించింది. అలాగే, ఈ రెండు నౌకలు రష్యా, ఇరాన్, వెనెజువెలా నుంచి ఆసియా దేశాలకు చమురు తరలిస్తున్నాయని అమెరికా అంతర్గత భద్రతా శాఖ మంత్రి క్రిస్టీ నోయమ్ తెలిపారు.

డిసెంబరు 15న బెల్లా–1 పేరుతో ఈ నౌక కరీబియన్ వైపు ప్రయాణం ప్రారంభించింది. కానీ అకస్మాత్తుగా దిశ మార్చుకొని యూరోప్ వైపు వెళ్లడం అమెరికాకు అనుమానాలు కలిగించింది. అప్పటి నుంచే దీనిని సీజ్ చేయడానికి అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ విమానాలు స్కాట్లాండ్‌లోని జాన్ ఓ గ్రోట్స్ విమానాశ్రయానికి చేరాయి. జలాంతర్గాములను గుర్తించే విమానాలు, ఇంధనం నింపే KC-135 విమానాలు కూడా ఐస్‌లాండ్ వైపు కదిలాయి.

ఈ ఘటనపై రష్యా విదేశాంగ శాఖ స్పందిస్తూ, తమ నౌక అంతర్జాతీయ జలాల్లోనే ప్రయాణిస్తోందని, అంతర్జాతీయ నౌకాయాన చట్టాలను పూర్తిగా పాటిస్తోందని స్పష్టం చేసింది. 1982 ఐరాస సముద్ర చట్టం ప్రకారం, ఒక దేశానికి చెందిన నౌకను మరో దేశం స్వాధీనం చేసుకునే హక్కు లేదని రష్యా రవాణా శాఖ ప్రకటించింది. నౌకలోని సిబ్బంది హక్కులను కాపాడాలని కూడా డిమాండ్ చేసింది.

అమెరికాకు సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, గత కొన్ని రోజులుగా అమెరికా తీర రక్షణ దళం ఈ నౌకను గమనిస్తోందని రష్యా పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి