Breaking News

సోషల్ మీడియా వీడియోతో మొదలైన వివాదం… అరెస్టుతో ముగింపు

సోషల్ మీడియా వీడియోతో మొదలైన వివాదం… అరెస్టుతో ముగింపు


Published on: 22 Jan 2026 10:55  IST

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన దీపక్ ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న 35 ఏళ్ల షిమ్జితా ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ ప్రాణాలు తీసుకునే స్థితికి చేరడానికి ఆమె చర్యలే కారణమన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి, బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. దీపక్ మరణంపై సమగ్ర విచారణ జరిపి, వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని నార్త్ జోన్ డీఐజీకి ఆదేశాలు జారీ చేసింది.

అసలు ఏం జరిగింది?

కొద్దిరోజుల క్రితం దీపక్, షిమ్జితా ఇద్దరూ ఒకే బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో దీపక్ తనను ఉద్దేశపూర్వకంగా తాకాడంటూ షిమ్జితా ఆరోపించింది. ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించి, తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది.

ఆ వీడియో తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.
దాదాపు 20 లక్షల మందికి పైగా ఆ వీడియోను చూసినట్లు సమాచారం. నెటిజన్లు దీపక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో అతడు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

అవమాన భారంతో ప్రాణత్యాగం

వీడియో వైరల్ కావడం, సమాజంలో ఎదురైన అవమానం దీపక్‌ను తీవ్రంగా కలచివేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ పరిస్థితిని భరించలేక కోజికోడ్‌లోని తన నివాసంలో ఆదివారం దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై దీపక్ తల్లి హృదయ విదారకంగా స్పందించారు.
“నా కొడుకు ఎప్పుడూ తప్పు చేసే వాడు కాదు. ఆ అవమానాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. రెండు రోజులుగా సరిగా తిండి కూడా తీసుకోలేదు. శనివారం కూడా అన్నం తినలేదు. అదే రోజు అతడి పుట్టిన రోజు” అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

వీడియోలు తొలగించిన షిమ్జితా

దీపక్ ఆత్మహత్య విషయం వెలుగులోకి రావడంతో షిమ్జితా మొదటగా వైరల్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించింది. అనంతరం తన వాదనను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ వీడియోను కూడా ప్రైవేట్‌గా మార్చింది.

ఈ వ్యవహారంపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి, విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియా బాధ్యతపై చర్చ

ఈ ఘటన సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు బాధ్యత, పరిణామాలు ఎంత తీవ్రమైనవో మరోసారి చర్చకు తెచ్చింది. న్యాయ విచారణకు ముందే సోషల్ మీడియా ద్వారా వ్యక్తిని దోషిగా చిత్రీకరించడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టంగా చూపుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి