Breaking News

ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి జప్తు చేసిన మా ఆస్తులు ఇవ్వడానికి సిద్ధం

ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి జప్తు చేసిన మా ఆస్తులు ఇవ్వడానికి సిద్ధం


Published on: 23 Jan 2026 10:08  IST

ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా సహా పలు దేశాలు జప్తు చేసిన రష్యా ఆస్తులను యుద్ధంతో నష్టపోయిన ప్రాంతాల పునర్నిర్మాణానికి వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేక రాయబారిగా ఉన్న స్టీవ్ విట్‌కాఫ్‌తో చర్చలకు ముందు పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.

అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో ఫ్రీజ్ అయిన రష్యా ఆస్తుల్లో మిగిలిన మొత్తాన్ని రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత పునర్నిర్మాణానికి ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఇదే సమయంలో మరో సంచలన ప్రకటన కూడా చేశారు.
గాజాలో శాంతి ప్రయత్నాల కోసం అమెరికాలో ఫ్రీజ్ అయిన రష్యా ఆస్తుల నుంచి 1 బిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వనున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం కనుగొనే దిశగా అమెరికా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు.

గ్రీన్‌లాండ్ విషయంలో రష్యా నో కామెంట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న డిమాండ్‌పై పుతిన్ స్పష్టమైన స్పందన ఇచ్చారు.
“గ్రీన్‌లాండ్ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ అంశంపై రష్యాకు ఆందోళన కూడా లేదు” అని ఆయన తేల్చిచెప్పారు.

బుధవారం రాత్రి నిర్వహించిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
డెన్మార్క్ గ్రీన్‌లాండ్‌ను చాలా కాలంగా ఒక కాలనీలా చూసిందని, కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించినా, అది ప్రస్తుతం చర్చకు అంశం కాదన్నారు. ఈ విషయంలో రష్యా జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు.

ట్రంప్ స్వరంలో మార్పు?

ఇదిలా ఉండగా గ్రీన్‌లాండ్ విషయంలో కఠినంగా మాట్లాడిన ట్రంప్ తాజాగా కొంత సడలింపు ప్రదర్శించారు.
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో “గ్రీన్‌లాండ్ కోసం బలప్రయోగం చేయను” అని ప్రకటించారు. అయితే సహకరించని దేశాలపై సుంకాలు విధిస్తామన్న హెచ్చరిక మాత్రం కొనసాగింది.

అదే సమయంలో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్‌తో ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు సంబంధించి భవిష్యత్ ఒప్పందంపై ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. అయితే ఆ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు.

ట్రంప్ విస్పరర్’గా మారిన నాటో చీఫ్?

ట్రంప్ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకోవడం వెనుక నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్ దౌత్యనీతే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ట్రంప్ చెవిలో రుట్ ఏమి చెప్పారో తెలియకపోయినా, ఆయన మాటల ప్రభావంతో పరిస్థితి కొంత శాంతించినట్టు కనిపిస్తోంది. ఈ కారణంగా రుట్‌కు ఇప్పుడు అంతర్జాతీయంగా ‘ట్రంప్ విస్పరర్’ అనే పేరు వినిపిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి