Breaking News

ఎంఎంటీఎస్–మెట్రో–ఆర్టీసీ అనుసంధానానికి ప్రభుత్వం కొత్త ప్రణాళిక

ఎంఎంటీఎస్–మెట్రో–ఆర్టీసీ అనుసంధానానికి ప్రభుత్వం కొత్త ప్రణాళిక


Published on: 23 Jan 2026 10:17  IST

నగరంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను ఒకే గొలుసులో కలపాలనే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రయాణికులు ఒక రవాణా వ్యవస్థ నుంచి మరొకదానికి సులువుగా మారేందుకు స్కైవాక్‌లు, రోడ్డు మార్గాలు, బస్టాప్‌ల పునర్వ్యవస్థీకరణ వంటి పనులు చేపట్టాలని నిర్ణయించింది.

ప్రధానంగా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఎంఎంటీఎస్ స్టేషన్లలోకి వెళ్లేలా స్కైవేలు (స్కైవాక్‌లు) నిర్మించనున్నారు. అలాగే ఎంఎంటీఎస్ స్టేషన్లకు దూరంగా ఉన్న బస్టాప్‌లను దగ్గరికి తరలించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ అంశాలపై హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఉమ్టా) సమగ్రంగా అధ్యయనం చేసింది.

పక్కపక్కనే స్టేషన్లు… కానీ సదుపాయాలు లేవు

సికింద్రాబాద్ నార్త్, సౌత్, బేగంపేట, నాంపల్లి, భరత్‌నగర్, మలక్‌పేట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, ప్రయాణికులకు నడిచివెళ్లే సరైన మార్గాలు లేవు.

కొన్ని చోట్ల తప్ప ఎక్కువ స్టేషన్లలో స్కైవాక్‌లు లేకపోవడం వల్ల ప్రజలు ఒక సేవ నుంచి మరొకదానికి మారేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంఎంటీఎస్ స్టేషన్, సమీప బస్టాప్‌లను కలిపేలా త్వరలో స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

బస్టాప్‌లు దూరంగా ఉండటమే ప్రధాన సమస్య

నగరంలోని మొత్తం 51 ఎంఎంటీఎస్ స్టేషన్లలో కేవలం 21 మాత్రమే బస్టాప్‌లకు 500 మీటర్ల లోపల ఉన్నాయి. మిగిలిన స్టేషన్లకు బస్టాప్‌లు చాలా దూరంగా ఉండటంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ను పెద్దగా వినియోగించడం లేదని అధ్యయనంలో వెల్లడైంది.

దూరాల వివరాలు:

  • 500 మీటర్లలోపల ఉన్న స్టేషన్లు – 21

  • 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నవి – 12

  • 1 కిలోమీటర్‌కు మించి దూరంలో ఉన్నవి – 18

ఈ సమస్యను పరిష్కరించేందుకు బస్టాప్‌లను ఎంఎంటీఎస్ స్టేషన్లకు దగ్గరగా మార్చడం, లేదా నడిచివెళ్లేలా కొత్త రోడ్లు, స్కైవాక్‌లు నిర్మించాలని నిర్ణయించారు.

బ్యాటరీ వాహనాల ప్రతిపాదన

కొన్ని చోట్ల బస్టాప్‌లను తరలించడం సాధ్యం కానప్పుడు, ప్రయాణికులను స్టేషన్లకు చేరవేసేందుకు తక్కువ చార్జీలతో బ్యాటరీ వాహనాలు నడిపే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు.

నగరంలో రోజువారీ ప్రజారవాణా వినియోగం

నగర ప్రజలు రోజూ ఏ రవాణా మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్న వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఆర్టీసీ బస్సులు – సుమారు 25 లక్షల మంది

  • మెట్రో రైలు – సుమారు 5 లక్షల మంది

  • ఎంఎంటీఎస్ – రోజుకు 40 నుంచి 50 వేల మంది మాత్రమే

  • వ్యక్తిగత వాహనాలు – సుమారు 70 లక్షల మంది

Follow us on , &

ఇవీ చదవండి