Breaking News

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నేడు పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నేడు (మే 13, 2026) పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు.


Published on: 13 May 2026 16:10  IST

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నేడు (మే 13, 2026) పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసు దర్యాప్తులో భాగంగా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరుకావాలని బండి భగీరథ్‌కు నోటీసులు ఇచ్చింది. అయితే నిర్ణీత సమయానికి ఆయన హాజరుకాలేదు.

తీవ్రమైన సెక్షన్ల జోడింపు: బాధితురాలి నుంచి పోలీసులు రెండోసారి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో మరికొన్ని కఠినమైన సెక్షన్లను చేర్చారు. ప్రాథమికంగా పెట్టిన సెక్షన్లతో పాటు ఇప్పుడు BNS 74, 75 మరియు పోక్సో సెక్షన్ 5 (i) రెడ్ విత్ 6 (తీవ్రమైన లైంగిక దాడి) కింద కేసును మార్చారు.

హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్: అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు (గురువారం, మే 14) హైకోర్టు విచారణ జరపనుంది.

పోలీసుల గాలింపు: గత రెండు రోజులుగా బండి భగీరథ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని, ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. కుకట్‌పల్లి డీసీపీ రీతిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి.

బండి సంజయ్ స్పందన: తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, తప్పు చేసి ఉంటే చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని, అయితే కేవలం రాజకీయంగా టార్గెట్ చేయడానికే ఈ కేసులను వాడుకుంటున్నారని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి