Breaking News

డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుపై జోరుగా ప్రచారం

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతుండగా, డీఎంకే-అన్నాడీఎంకే పొత్తు వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.


Published on: 07 May 2026 10:53  IST

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, పూర్తి మెజార్టీకి కావాల్సిన సంఖ్యను చేరుకోలేకపోయింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా రాజకీయ చర్చలు, సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

టీవీకేకు 108 స్థానాలు లభించగా, డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసినా పూర్తి మెజార్టీకి మిత్రపక్షాల మద్దతు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఏఐఏడీఎంకే వర్గాలు రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని చెబుతుండగా, డీఎంకే మాత్రం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రమే విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

వీసీకేతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. అయితే అన్నాడీఎంకే, లెఫ్ట్ పార్టీలు ఇప్పటివరకు టీవీకేతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. గవర్నర్ విజయ్‌ను సంఖ్యా బలం నిరూపించాలని కోరిన నేపథ్యంలో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

Follow us on , &

ఇవీ చదవండి