Breaking News

పురపాలక, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్లకు ఎస్‌ఈసీ లేఖలు

పురపాలక, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్లకు ఎస్‌ఈసీ లేఖలు


Published on: 04 Sep 2025 10:53  IST

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగానే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యే సమయంలో ఎన్నికలు జరగాలి. అయితే చట్టం ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించి, 2026 జనవరిలోనే ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే పంచాయతీరాజ్, పురపాలక శాఖ కమిషనర్లకు లేఖలు పంపి ఈ విషయంపై ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం 2026 ఏప్రిల్‌లో ముగియనుండగా, నగరపాలక, పురపాలక సంస్థల కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం 2026 మార్చిలో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జనవరిలోనే ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు ప్రారంభించాలని కమిషన్ స్పష్టం చేసింది.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందస్తు ప్రణాళిక

కమిషన్ లేఖలో ఎన్నికల ఏర్పాట్లకు తాత్కాలిక షెడ్యూల్ కూడా సూచించింది:

  • 2025 అక్టోబర్ 15లోపు – వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.

  • అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోపు – వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించాలి.

  • నవంబర్ 1 నుంచి 15లోపు – ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.

  • నవంబర్ 16 నుంచి 30లోపు – పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంల సిద్ధత, అవసరమైన సామగ్రి సేకరణ జరగాలి.

  • డిసెంబర్ 15లోపు – రిజర్వేషన్లను తుది నిర్ణయం తీసుకోవాలి.

  • డిసెంబర్ చివరి వారంలో – రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి.

  • 2026 జనవరి – ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అదే నెలలో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలి.

Follow us on , &

ఇవీ చదవండి