Breaking News

రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతిపరులపై నిఘా పెట్టాం. వారి బినామీల డేటాను ఏఐ ద్వారా సేకరిస్తున్నాం

రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతిపరులపై నిఘా పెట్టాం. వారి బినామీల డేటాను ఏఐ ద్వారా సేకరిస్తున్నాం


Published on: 03 Jan 2026 11:58  IST

రాష్ట్రంలో అవినీతిపై కఠినంగా వ్యవహరించేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అవినీతికి పాల్పడే పెద్దస్థాయి అధికారులపై నిఘా పెంచామని, వారి బినామీల వివరాలను ఆధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా సేకరిస్తున్నామని ఏసీబీ డీజీ అతుల్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ ఏడాది అవినీతి తిమింగలాలపై దృష్టి సారించి, కేసులు నమోదు చేసిన మూడేళ్లలోనే జైలుకు పంపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

విజయవాడలోని ఎన్టీఆర్‌ పరిపాలన భవనంలో జరిగిన మీడియా సమావేశంలో గత ఏడాది ఏసీబీ పనితీరును ఆయన వివరించారు. అక్రమాస్తుల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో ఆస్తులు బినామీల పేర్లపై కూడబెట్టిన అధికారులను గుర్తించామని, వారి ఆస్తుల లావాదేవీలపై నిఘా కొనసాగుతోందన్నారు. భూముల రిజిస్ట్రేషన్లు, బ్యాంకు లావాదేవీల వంటి వివరాలను ఐజీఆర్‌ఎస్‌ వ్యవస్థతో పాటు ఇతర వనరుల నుంచి ఏఐ ద్వారా సేకరించి, అవినీతి డేటాను ఒకేచోట సమీకరిస్తామని తెలిపారు.

రెవెన్యూ శాఖపై ప్రత్యేక నజర్

ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ విభాగంలో అవినీతి ఎక్కువగా కనిపిస్తోందని అతుల్‌ సింగ్‌ చెప్పారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలపై దాడుల సమయంలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది మరో నాలుగు కీలక శాఖలను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 2025లో ఇప్పటివరకు 115 కేసులు నమోదు చేసి పలువురిని జైలుకు పంపినప్పటికీ, అవినీతి పూర్తిగా అదుపులోకి రాలేదని అంగీకరించారు. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరించామని తెలిపారు.

‘‘అవినీతిపరులకు కఠిన శిక్షలు పడితేనే భయం ఏర్పడుతుంది’’ అని సీఎం సూచించినట్లు డీజీ తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064తో పాటు ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా 9440440057 నంబర్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది 1064కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 16 కేసులు నమోదు చేసి నిందితులను జైలుకు పంపామని వివరించారు.

శిక్షల శాతం పెంచే దిశగా చర్యలు

అవినీతి కేసుల్లో శిక్షలు పడే శాతం సంతృప్తికరంగా లేదని అతుల్‌ సింగ్‌ చెప్పారు. గత ఏడాది కోర్టు తీర్పుల్లో కేవలం 46 శాతం కేసుల్లోనే శిక్షలు పడినట్లు తెలిపారు. చాలామంది సాక్షులు మొదట స్టేట్‌మెంట్‌ ఇచ్చి, కోర్టులో మాట మార్చుతున్నారని చెప్పారు. ఇకపై న్యాయమూర్తి ఎదుట 164 స్టేట్‌మెంట్‌లు రికార్డు చేయించి, మాట మార్చితే చట్టపరమైన చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

ఈ ఏడాది కనీసం 75 శాతం కేసుల్లో శిక్షలు పడేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందుకోసం లీగల్‌ టీమ్‌, దర్యాప్తు అధికారులకు ఏఐ టెక్నాలజీపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అవినీతి కేసుల్లో శిక్షలు పడేందుకు పదేళ్లకుపైగా సమయం పడుతోందని, ఇకపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన మూడేళ్లలోనే తీర్పులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

లంచాల కేసుల్లో వేగం పెరిగింది

ఈ ఏడాది రూ.25 వేల నుంచి రూ.25 లక్షల వరకు లంచాలు తీసుకుంటూ పలువురు అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని ఏసీబీ డీజీ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఏసీబీ జేడీలు, సీనియర్‌ అధికారులు, లీగల్‌ అడ్వైజర్లు పాల్గొన్నారు.

ఇటీవల వెలుగులోకి వచ్చిన కీలక కేసులు

  • గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఓ ఉన్నత ఇంజనీర్‌ విజయవాడలో భారీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

  • అనంతపురం జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్‌ లంచం కేసులో ఏసీబీకి చిక్కారు.

  • లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌, ఫారెస్ట్‌ శాఖ అధికారి సహా పలువురు అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్టయ్యారు.

  • కాకినాడ జిల్లాలో రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చెందిన అధికారులు లంచం కేసులో బుక్కయ్యారు.

అవినీతిపై కఠిన పోరాటం

ఏఐ టెక్నాలజీని వినియోగించి వేగంగా, నాణ్యతతో కూడిన దర్యాప్తు చేపడతామని ఏసీబీ స్పష్టం చేసింది. అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి శిక్షలు పడేలా చేయడమే తమ తుదిలక్ష్యమని డీజీ అతుల్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి