Breaking News

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం వేగంగా కదులుతోంది.


Published on: 03 Apr 2025 12:11  IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం వేగంగా కదులుతోంది. వచ్చే నెల మే నుంచి "తల్లికి వందనం" పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే, అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో సమన్వయం చేసి, రైతుల ఖాతాల్లో మొత్తం రూ. 20,000ను మూడు విడతల్లో జమ చేయాలని నిర్ణయించింది.

ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పథకాల అమలు, అమరావతి నిర్మాణ పనుల పురోగతి, ప్రధాని మోదీ పర్యటన, ఇతర కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్

ఈ రోజు (గురువారం) జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశంలో డ్రోన్ పాలసీ, భూఅందుబాటు, అమరావతి అభివృద్ధి తదితర అంశాలపై చర్చ జరగనుంది. ఇప్పటికే అమరావతిలో నిర్మాణ పనుల కోసం టెండర్లు ఖరారు చేశారు. అలాగే, పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల మూడో వారంలో ప్రధాని అమరావతిని సందర్శించే అవకాశముందని సమాచారం.

అంతేకాక, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన తొలి విడత రుణ నిధులను వినియోగించేందుకు, పలు సంస్థలకు భూఅందుబాటు, కొత్త పెట్టుబడుల ప్రోత్సాహంపై ప్రభుత్వం చర్చించనుంది.

తల్లుల ఖాతాల్లో నిధుల జమ – డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత

ఇక, డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈ నెలలోనే విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరానికి (జూన్ 12) ముందే కొత్త ఉపాధ్యాయుల నియామకం పూర్తవ్వాలన్న ఉద్దేశ్యంతో మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

అదేవిధంగా, తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే బడ్జెట్‌లో దీనికి నిధులను కేటాయించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15,000 చొప్పున నగదు జమ చేయాలని సీఎం ప్రకటించారు. పథకం అమలుకు సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి