Breaking News

టీమిండియాపై ఛేజింగ్ అంటే.. ఆస్ట్రేలియాను వణికిస్తున్న ట్రాక్ రికార్డు

నరేంద్ర మోదీ స్టేడియం బిగ్‌ఫైట్‌కు ముస్తాబైంది. నెలన్నర రోజుల పాటు ఫ్యాన్స్‌కు కిక్కు ఇచ్చిన ప్రపంచకప్ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండు సార్లు ఛాంపియన్ అయిన టీమిండియా, ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా అమీతుమీకి సిద్ధమైంది.


Published on: 18 Nov 2023 14:56  IST

అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్ ఫైనల్ పోరుకు ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. టోర్నీలో అజేయ జైత్రయాత్ర సాగిస్తూ ఫైనల్ చేరిన టీమిండియా.. తుదిపోరులోనూ ఇదే ఊపు కొనసాగించి ముచ్చటగా మూడోసారి ట్రోఫిని పట్టేయాలని గట్టి పట్టుదలతో ఉంది. అటు ఆస్ట్రేలియా సైతం ఆరోసారి ఛాంపియన్లుగా నిలవాలని కలలు కంటోంది. న్యూజిలాండ్ మీద గెలుపొంది టీమిండియా.. సఫారీలను చిత్తు చేసి ఆస్ట్రేలియా ఫైనల్ పోరులోకి అడుగుపెట్టాయి. ఫైనల్ పోరుకు ముందు ఇరుజట్ల బలాబలాలను ఓ సారి పరిశీలిద్దాం.

వన్డే క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా, ఇండియా ఇప్పటివరకూ 150 వన్డేలలో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో టీమిండియా 57 మ్యాచ్‌లలో గెలుపొందగా.. ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌లలో విజయం సాధించింది. పది మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. ఇరు జట్ల మధ్య వన్డే ప్రపంచకప్‌కు ముందు మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇరుజట్లూ ఇప్పటి వరకూ13 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో ఎనిమిది సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. టీమిండియా ఐదు మ్యాచ్‌లలో గెలుపొందింది. ఆఖరి మూడు మ్యాచ్‌లలో భారతజట్టు రెండుసార్లు ఆస్ట్రేలియా మీద గెలుపొందింది. టీమిండియా ఓడిపోయిన మ్యాచ్‌లలో 2003 ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్ కూడా ఒకటి. నాటి ఓటమికి రోహిత్ సేన ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

ఇదే సమయంలో టీమిండియా ఆస్ట్రేలియా మీద గెలిచిన మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేస్తూ గెలిచినవి మూడు మ్యాచ్‌లు కాగా.. మరో రెండింటిలో ఛేజింగ్ చేస్తూ నెగ్గింది. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా మనమీద నెగ్గిన ఎనిమిది మ్యాచ్‌లలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ గెలిచినవే ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో మాత్రమే ఆస్ట్రేలియా ఛేజింగ్‌‍లో విజయం సాధించింది. ఈ లెక్కలన్నీ పరిశీలించిన తర్వాత.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని, ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం నిర్దేశిస్తే విజయం మనదేనని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

 

Follow us on , &

Source From: samayam

ఇవీ చదవండి