Breaking News

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం


Published on: 29 Dec 2025 10:50  IST

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సాగునీటి రంగమే ప్రధాన అజెండాగా మారనుంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం కొనసాగుతుండటంతో సభలో కూడా తీవ్ర స్థాయి చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, చేపట్టిన ప్రాజెక్టులు, వాటిపై గత ప్రభుత్వాల పనితీరు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలను సమీకరిస్తోంది.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చ

ఈ సమావేశాల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కీలకంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

రాష్ట్ర ఏర్పాటైన తర్వాత గత పదేళ్లలో చేపట్టిన

  • కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు

  • వాటికి ఖర్చు చేసిన నిధులు

  • ఎంత ఆయకట్టుకు నీరు అందిందనే వివరాలు

అలాగే కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ–తెలంగాణ మధ్య ఉన్న ఒప్పందాలు, కేటాయింపులు కూడా సభలో చర్చకు వచ్చే అవకాశముంది. ఈ అంశానికే ఒకరోజు మొత్తం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

కేసీఆర్ హాజరుపై ఆసక్తి

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉండటంతో ఈ సమావేశాలపై ఆసక్తి పెరిగింది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

సాగునీటి విషయంలో “నిజాలు బయటపెడతాం” అంటూ బచావత్ ట్రిబ్యునల్ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇస్తూ, కేసీఆర్ సభకు వస్తే నీటి కేటాయింపులపై బహిరంగంగా చర్చిద్దామని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సభలో ఘాటైన చర్చ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సోమవారం సభలో జరిగే కార్యక్రమాలు

సోమవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే

  • మొదట డిప్యూటీ స్పీకర్ ఎన్నిక

  • ఆపై ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టడం

జరుగుతుంది.

సీఎం రేవంత్ రెడ్డి

  • తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2025

  • మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులు

  • 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర శిక్ష, పీఎం శ్రీ ఆడిట్ నివేదికలు

సభ ముందు ఉంచనున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • ప్రభుత్వ ఉద్యోగుల సేవా, వేతన నిబంధనలకు సంబంధించిన రెండు బిల్లులను

ప్రవేశపెడతారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

  • పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, ఎంపీపీ–జడ్పీ గెజిట్‌ను

సభలో ఉంచుతారు.

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

  • హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆడిట్ నివేదికలను

సమర్పిస్తారు.

ఇతర అంశాలు

  • ఇటీవల మరణించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు సభలో సంతాపం

  • జీరో అవర్ నిర్వహణ

  • అనంతరం సభలను జనవరి 2వ తేదీకి వాయిదా

అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఇందులో సమావేశాల వ్యవధిపై నిర్ణయం తీసుకుంటారు.

రాజకీయ పార్టీల స్పందనలు

సభను హుందాగా నడుపుతాం: శ్రీధర్‌బాబు

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..
కేసీఆర్ సభకు వస్తే ఆయన గౌరవానికి భంగం కలగనివ్వబోమని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్నారు.

చర్చకు సిద్ధం: కేటీఆర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..
సాగునీటి అంశంపై అసెంబ్లీలో చర్చకు తాము పూర్తిగా సిద్ధమని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టెండర్లు రద్దు చేసిందని ఆరోపించారు.

సాగునీటి రంగం అస్తవ్యస్తం: బీజేపీ

బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి