Breaking News

ఇంటర్నెట్ యూజర్లను హ్యాకర్లు ఎలా బోల్తా కొట్టిస్తారో తెలుసా

Types of Cyber Attacks ఈరోజుల్లో ఇంటర్నెట్ యూజర్లను హ్యాకింగ్ పేరిట సైబర్ నేరగాళ్లు సులభంగా మోసం చేస్తున్నారు. ఈ సందర్భంగా హ్యాకర్లు మనల్ని ఎలా బోల్తా కొట్టిస్తున్నారు.. వారి బారిన పడకుండా తప్పించుకోవడానికి ఏం చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


Published on: 22 Aug 2023 17:41  IST

Types of Cyber Attacks ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్ర పోయేంత వరకు ఇంటర్నెట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈరోజుల్లో గుండుసూది నుంచి గుమ్మడికాయ దాకా ప్రతిదీ ఆన్‌లైనులో అందుబాటులో ఉంటుంది. ఆన్ లైన్ షాపింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో ఆన్ లైన్ మోసాలు కూడా పెరగడం విచారకరం. ఏవేవో మెసెజెస్ లేదా ఫేక్ కాల్స్‌తో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మన అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్ లైన్లో ఎన్నో మోసాలు చేస్తున్నారు. అందుకే ఇలాంటి కేటుగాళ్లు చేసే మోసాల నుంచి వీలైనంత మేరకు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా హ్యాకర్లు ఇంటర్నెట్లో కంప్యూటర్ సిస్టమ్, నెట్వర్క్ సెక్యూరిటీని హ్యాక్ చేసి ఇంటర్నెట్ యూజర్లను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యాకర్లు మోసం చేసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మోసపూరిత లింక్స్..
సాధారణంగా హ్యాకర్లు అమాయక ప్రజలను మోసం చేయడానికి కొన్ని హానికరమైన లింక్స్‌ను మెసెజ్ రూపంలో లేదా వాట్సాప్‌లో పంపుతారు. వాటిపై మనం క్లిక్ చేస్తే చాలు.. అప్పుడు ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అంతే అక్కడి నుంచి మీ పర్సనల్ డేటాను ఈజీగా కొట్టేస్తారు.

ఈ-మెయిల్స్ బెదిరింపులు..
మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారు ఇతర పేర్లతో మీకు ఈ-మెయిల్స్ పంపుతారు. అంతేకాదు మీ పేరుతో మీకు తెలిసిన వాళ్లకు మెయిల్స్ పంపి వారిని మోసం చేస్తారు. దీంతో మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ-మెయిల్ పాస్‌వర్డులను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఏ మొబైల్ లేదా సిస్టమ్‌లో మెయిల్ ఓపెన్ చేసినా, మీ పని పూర్తయ్యాక కచ్చితంగా లాగవుట్ లేదా సైన్ అవుట్ చేయాలి. లేదంటే ఇతరులు మీ మెయిల్‌ను వాడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొచ్చు.

డొమైన్ మెసెజ్..
ఇంటర్నెట్లో డొమైన్ అనేది ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయడానికి ఒక మార్గం. అయితే, కొందరు హ్యాకర్లు తమ లక్ష్యాలను సాధించేందుకు హానికరమైన ఇ-మెయిల్స్ పంపడానికి డొమైన్లను కూడా వాడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ప్రముఖ బ్రాండ్ పేర్లను వాడటం..
హ్యాకర్లు ఇంటర్నెట్ యూజర్లను మోసం చేసేందుకు ప్రముఖ బ్రాండ్ లోగోలను లేదా వాటి పేర్లతో మోసపూరిత మెసెజెస్‌ను పంపుతారు. ఇవి చూసి మీరు నిజమనుకునేలా కొంత అట్రాక్టివ్ మెసెజెస్ కూడా పంపుతారు. ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

లాగిన్ సమాచారం..
హ్యాకర్లు సాధారణంగా ఇంటర్నెట్ యూజర్ల లాగిన్ సమాచారాన్ని అడ్డదారుల్లో పొందేందుకు ప్రయత్నిస్తారు. దీని కోసం ఫేక్ కాల్స్ చేసి మాట్లాడతారు లేదా పోలీసులమని చెప్పి ఇతర పేర్లను చెప్పి బెదిరించి, మీ దగ్గర్నుంచి సమాచారాన్ని రాబడతారు. మీరు భయపడి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ వారికి ఇచ్చిన క్షణాల్లోనే, మీ అకౌంట్‌ను హ్యాక్ చేసేస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికీ పలుచోట్ల నిరంతరాయంగా జరుగుతున్నాయి.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి