Breaking News

జగిత్యాల జలమయం..నిలిచిన రాకపోకలు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రధాన మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.


Published on: 29 Jul 2026 15:58  IST

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రధాన మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రధాన రవాణా అంతరాయాలు & ప్రత్యామ్నాయ మార్గాలు:

జగిత్యాల - ధర్మపురి మార్గం బంద్: ధర్మపురి మండలంలోని అనంతారం వాగు, నేరెళ్ల వాగులు జాతీయ రహదారిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణాలను నిలిపివేశారు.

ప్రత్యామ్నాయ రూట్: జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్లే వాహనదారులు కల్లెడ, యశ్వంతరావుపేట, వెల్గటూర్ మీదుగా లేదా రాజారాంపల్లి రూట్ ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

రోడ్డుకు గండి: ఆక్సాయిపల్లె - నాగారం మధ్య ఉన్న ప్రధాన రహదారి వరద తాకిడికి గండి పడింది.

వెంకటాద్రి నగర్ నిర్బంధం: జగిత్యాల పట్టణ పరిధిలోని గోవిందుపల్లి వాగు ఉప్పొంగడంతో వెంకటాద్రి నగర్‌కు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయింది. ఇక్కడి ప్రజలను తరలించేందుకు మున్సిపల్ అధికారులు జేసీబీలను రంగంలోకి దించారు.

జలమయమైన లోతట్టు ప్రాంతాలు:

జిల్లాలో అత్యధికంగా సారంగపూర్ మండలంలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కోరుట్ల నియోజకవర్గంలో పూల్ వాగు, పెద్దవాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లోని మురికి కాలువలు పొంగి రోడ్లపైకి చేరాయి.

జగిత్యాల పట్టణంలోని దగ్గులమ్మ గుడి పరిసరాలు, ఉప్పరపేట, ఖిలాగడ్డ, సలీమా ఫంక్షన్ హాల్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

వెల్గటూర్ మండలంలోని రాంనూర్, కుమ్మరిపల్లి, జగదేవ్‌పేట, స్తంభంపల్లి గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.

అధికారుల హెచ్చరికలు:
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జగిత్యాల సహా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ తీవ్ర వర్షాల హెచ్చరిక జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని జిల్లా యంత్రాంగం, పోలీసులు హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి