Breaking News

గణేష్ లడ్డు పంచాడు..రూ.కోట్లు కొట్టేశాడు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని మైహోం భూజ అపార్ట్‌మెంట్‌లో గణేష్ లడ్డూ వేలం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి గణేష్‌పై రూ.3.45 కోట్ల పెట్టుబడుల మోసం కేసు నమోదైంది. భక్తి ముసుగులో అపార్ట్‌మెంట్ వాసులను నమ్మించి ఆయన ఈ భారీ మోసానికి పాల్పడినట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు గుర్తించారు.


Published on: 07 Aug 2026 18:16  IST

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని మైహోం భూజ అపార్ట్‌మెంట్‌లో గణేష్ లడ్డూ వేలం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి గణేష్పై రూ.3.45 కోట్ల పెట్టుబడుల మోసం కేసు నమోదైంది. భక్తి ముసుగులో అపార్ట్‌మెంట్ వాసులను నమ్మించి ఆయన ఈ భారీ మోసానికి పాల్పడినట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు గుర్తించారు.

ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేష్, గచ్చిబౌలిలోని మైహోం భూజ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నివసించేవాడు. గతేడాది (2025) వినాయక చవితి ఉత్సవాల్లో ఇక్కడి గణేష్ లడ్డూను రూ. 51,07,777 (రూ. 51 లక్షల పైచిలుకు) రికార్డు ధరకు వేలంలో దక్కించుకున్నాడు. అంతకుముందు ఏడాది (2024) కూడా రూ. 29 లక్షలకు ఈయనే లడ్డూను పాడాడు.

లడ్డూను గెలుచుకున్న తర్వాత అపార్ట్‌మెంట్‌లోని నివాసితులందరికీ లడ్డూ ప్రసాదాన్ని పంచాడు. దీంతో తానేదో పెద్ద శ్రీమంతుడు, వ్యాపారవేత్త అని స్థానికులు నమ్మేలా చేశాడు.

అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన బోయినపల్లి కిరణ్ అనే వ్యక్తి ద్వారా నివాసితులతో పరిచయాలు పెంచుకున్నాడు. తాము కొత్తగా ప్రారంభించే వ్యాపారంలో పెట్టుబడి పెడితే నెలకు 6 శాతం లాభం ఇస్తామంటూ నమ్మబలికాడు.అతని లడ్డూ వేలం ఆడంబరాన్ని చూసి నిజమేనని నమ్మిన ఒక దంపతులు తొలుత రూ.31 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత లాభాల గురించి నిలదీయగా వాయిదాలు వేస్తూ వచ్చాడు. చివరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో గణేష్, కిరణ్ ఇద్దరూ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి రాత్రికి రాత్రే పరారయ్యారు.

వెలుగులోకి వచ్చిన మోసాలు

బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ లడ్డూ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం:

మొత్తం ఐదుగురు బాధితుల నుండి సుమారు రూ. 3.45 కోట్లు వసూలు చేసి మోసం చేశారు.

బాధితుల్లో కొందరు విశ్రాంత (రిటైర్డ్) ఉద్యోగులు కూడా ఉన్నారు. వారు తమ జీవితకాల సంపాదన మొత్తాన్ని గణేష్ చేతిలో పెట్టి మోసపోయారు.

బాధితుల ఫిర్యాదు మేరకు Cyberabad EOW పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి