Breaking News

సోదరుడి మృతదేహానికి రాఖి కట్టిన అక్క

మహబూబాబాద్ జిల్లా కురవిలో రక్షాబంధన్ పండుగకు ముందే ఒక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన తన తమ్ముడి మృతదేహానికి ఒక అక్క కన్నీరుమున్నీరుగా విలపిస్తూ రాఖీ కట్టింది.


Published on: 27 Aug 2026 17:54  IST

మహబూబాబాద్ జిల్లా కురవిలో రక్షాబంధన్ పండుగకు ముందే ఒక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన తన తమ్ముడి మృతదేహానికి ఒక అక్క కన్నీరుమున్నీరుగా విలపిస్తూ రాఖీ కట్టింది.

కురవి గ్రామానికి చెందిన మోటపోతుల రమేశ్‌ (36) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. బుధవారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, రాఖీ పండుగకు ముందే తమ్ముడు దూరమవడంతో అతని సోదరి తీవ్ర ఆవేదనకు లోనైంది.

పాడెపైనే రక్షాబంధనం: తమ్ముడికి చివరిసారిగా రాఖీ కట్టాలని నిర్ణయించుకున్న ఆ అక్క, పాడెపై ఉన్న రమేశ్ మృతదేహానికి కన్నీళ్లతో రాఖీ కట్టి అంతిమ వీడ్కోలు పలికింది. ఈ దృశ్యం అక్కడ ఉన్న బంధువులను, స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

ఈ కుటుంబంలో విషాదాలు ఇక్కడితో ఆగలేదు. కేవలం పది రోజుల క్రితమే రమేశ్‌ తండ్రి వీరన్న కూడా మృతి చెందారు. గురువారం (ఆగస్టు 27న) తండ్రి దశదినకర్మ నిర్వహించాల్సి ఉండగా, అంతలోనే రమేశ్‌ కూడా చనిపోవడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. గతంలో రమేశ్ తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఒకే ఇంట్లో వరుస మరణాలు సంభవించడం, పండుగ వేళ తమ్ముడి పాడెపై అక్క రాఖీ కట్టడం చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి