Breaking News

వాహనాల తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన లారీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా అధికారి (DTO) బి. వెంకన్న (45) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.


Published on: 22 Jun 2026 17:23  IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా అధికారి (DTO) బి. వెంకన్న (45) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన జూన్ 22, 2026 సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్టీవో (RTO) కార్యాలయం ఎదుట పరకాల – భూపాలపల్లి హైవేపై ఈ ప్రమాదం జరిగింది.డీటీఓ వెంకన్న తన సిబ్బందితో కలిసి రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లోడు టిప్పర్ లారీ ఆయనను వెనుక నుంచి బలంగా ఢీకొట్టి, ఆయన పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆయన శరీర భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతుడు వెంకన్న కేవలం 15-20 రోజుల క్రితమే జగిత్యాల జిల్లా నుండి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చారు.

విచారణ & లారీ వివరాలు

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ బీహార్‌కు చెందిన తస్లీమ్‌గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి అసలు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని అధికారులు గుర్తించారు. లారీ మెకానికల్ బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. కాగా, సదరు లారీ (TS 22T2687) పై గతంలోనే సిగ్నల్ జంపింగ్ వంటి కారణాల వల్ల ఐదు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి