Breaking News

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. త్వరలో ఈ రూట్లలో ప్రారంభం..

వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఫీల్డ్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయ్యింది.


Published on: 18 Mar 2025 18:20  IST

ఇప్పటికే దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై విజయవంతంగా, వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆధునీకరించబడిన వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో అనేక స్లీపర్ ట్రైన్స్ ఒకేసారి పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. దేశంలో సుమారు 200 వందే భారత్ స్లీపర్ రైళ్లను భారతీయ రైల్వే యోచిస్తోంది. ఇందులో ఎక్కువ వందే భారత్ రైళ్లు మధ్యప్రదేశ్‌లోని ప్రధాన మార్గాల్లో నడవనున్నాయి. ప్రస్తుతం 10 వందే భారత్ స్లీపర్ రైళ్ల ఉత్పత్తి పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఫీల్డ్ ట్రయల్ రన్ నిర్వహించారు. దీన్ని యుపి నుంచి ఎంపి వరకు రెండు రోజుల పాటు నడిపారు. దీన్ని మధ్యప్రదేశ్‌లోని కజురహో నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వేస్టేషన్ వరకు నడిపారు.

భారతీయ రైల్వే.. 2025-26 నాటికి పది వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. భారతదేశపు తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలు ట్రయల్‌ రన్‌ తర్వాత 2025లో ప్రారంభించే అవకాశం ఉన్నది. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్‌ కోచ్ ఫ్యాక్టరీ (ICF) జనరల్‌ మేనేజర్‌ సుబ్బారావు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నవంబర్‌ 15 నుంచి రెండునెలల పాటు రైళ్ల ఆసిలేషన్‌ ట్రయల్స్‌తో పాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తామని.. ఆ తర్వాత కమర్షియల్‌ సర్వీస్‌లోకి తీసుకువస్తామని తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యతనిచ్చేలా రైల్వేశాఖ తీర్చిదిద్దింది.

డిసెంబర్ 2 వరకు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ‘చైర్-కార్’ కోచ్‌లతో 136 వందే భారత్ రైలు సేవలు నడుస్తున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వీటిలో 16 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తమిళనాడులోని స్టేషన్ల అవసరాలను తీరుస్తున్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీ-వారణాసి మధ్య 771 కిలోమీటర్ల దూరంతో వందేభారత్ రైలు నడుస్తోందని మంత్రి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి