Breaking News

సుంకాల విషయంలో భారత్ వైఖరి సరిగా లేదని ట్రంప్ ఆరోపించాడు.

ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 2 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.


Published on: 03 Apr 2025 11:21  IST

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు ఊహించని షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్, ఇప్పుడు అధికారికంగా ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ఈ కొత్త విధానం ఏప్రిల్ 2 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది.

వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సహా పలు దేశాలపై కొత్త సుంకాలను విధించినట్టు ప్రకటించారు. ప్రధాని మోదీ తన స్నేహితుడేనని స్పష్టంగా చెప్పినప్పటికీ, అమెరికా పట్ల భారత్ అన్యాయంగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఏకంగా 52% సుంకం విధిస్తోందని, దీనికి ప్రతిగా భారత్‌పై 26%, చైనాపై 34% సుంకాలు విధిస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, "ఇప్పటి వరకు అమెరికాను అనేక దేశాలు లాభపడేందుకు వేదికగా మార్చుకున్నాయి. కానీ ఇక నుంచి అది జరగదు. మాపై అధిక సుంకాలు విధించే దేశాలపై మేము కూడా అదే విధంగా స్పందిస్తాం" అని స్పష్టం చేశారు.

అమెరికా భవిష్యత్తు తమ పౌరుల చేతుల్లోనే ఉందని, ఇతర దేశాలు విధిస్తున్న సుంకాలకు సగమే అమెరికా విధిస్తున్నా, అది కూడా దయతోనే చేస్తున్నామని తెలిపారు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని దేశీయ ఉత్పత్తులపై కనీసం 10% టారిఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. "ఈ రోజు అమెరికా పారిశ్రామిక రంగానికి పునర్జన్మ లభించిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది" అని అన్నారు.

గత 50 ఏళ్లుగా ఇతర దేశాలు అమెరికా వనరులను అన్యాయంగా ఉపయోగించుకున్నాయని ట్రంప్ ఆరోపించారు. అమెరికా దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్లపై కేవలం 2.4% సుంకం విధిస్తోంటే, థాయిలాండ్ 60%, భారత్ 70%, వియత్నాం 75% విధిస్తోందని గుర్తు చేశారు.

ఈ ప్రతీకార సుంకాల నిర్ణయం ప్రకటించిన తరువాత, అనేక దేశాల నేతలు, రాయబారులు తమ సుంకాలపై మినహాయింపు కోరుతూ సంప్రదించారని ట్రంప్ వెల్లడించారు. అయితే ఆయా దేశాలు తమ సుంకాలను తగ్గిస్తేనే తాను సడలింపు ఇస్తానని స్పష్టం చేశారు. అదనంగా, అమెరికా బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించినట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి