Breaking News

పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన మధుసూదన్‌రావుకు పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు

పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన మధుసూదన్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.


Published on: 24 Apr 2025 18:25  IST

నెల్లూరు, ఏప్రిల్ 24: జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. గురువారం కావలిలోని మధుసూదన్ ఇంటికి చేరుకున్న ఆయన, పార్థివదేహాన్ని దర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, "దేశం మొత్తం మధుసూదన్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తోంది. కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ విషాదాన్ని  జీర్ణించుకోలేకపోతున్నారు.వారు చెప్పిన మాటలు నా గుండెను కలచివేశాయి," అని తెలిపారు.
అంతేగాక, "ఏ మతాన్ని అనుసరిస్తున్నారో తెలుసుకుని మానవులను హత్య చేస్తే అది ఎంత దారుణమో ఊహించలేం. ఇది కిరాతక చర్య. ఇలాంటి వారి పట్ల ఏమాత్రం సహనశీలత ఉండరాదు," అని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మధుసూదనరావు మృతిచెందారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన కుటుంబంతో కలిసి కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లారు. దాడిలో గాయపడిన మధుసూదన్ మృతి చెందగా, బుధవారం రాత్రి ఆయన మృతదేహం చెన్నైకి, అక్కడి నుంచి నెల్లూరు జిల్లా కావలికి తరలించారు.తన కుమారుడిని చివరిసారిగా చూసిన మధుసూదన్ తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. ఇదే దాడిలో విశాఖపట్నం వాసి, మాజీ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కూడా మృతి చెందినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తోపాటు మంత్రులు ఆనం, నాదెండ్ల, సత్యకుమార్, ఎమ్మెల్యేలు కావ్యా కృష్ణారెడ్డి, సోమిరెడ్డి, అలాగే ఆర్ఎస్ఎస్ నేత మధుకర్ పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి