Breaking News

తిరుమలలో హంస వాహనంపై మలయప్పస్వామి దర్శనం

తిరుమలలో హంస వాహనంపై మలయప్పస్వామి దర్శనం


Published on: 26 Sep 2025 14:20  IST

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి మలయప్పస్వామి భక్తులకు ప్రత్యేక అలంకారంతో దర్శనమిచ్చారు. వీణ ధరించి సరస్వతీ దేవి రూపంలో హంసవాహనంపై స్వామివారు అలరించారు. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నశేషవాహన సేవలో భక్తుల రద్దీ తక్కువగా కనిపించింది. గ్యాలరీలు ఖాళీగా ఉండగా, సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో రాత్రి హంసవాహన సేవకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దక్షిణ మాడవీధి మినహా మిగిలిన గ్యాలరీలు అన్నీ నిండిపోయాయి.

భక్తులందరికీ తృప్తికరమైన దర్శనం కల్పించేందుకు వాహనాన్ని నెమ్మదిగా కదిలించారు. దీంతో సేవ కొద్దిగా ఆలస్యమై రాత్రి 7 గంటల నుండి 9.30 వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వీఐపీల రాకపోకలతో కొంత గందరగోళం నెలకొనగా, దీనిని తగ్గించాలని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, నటి వాసూకి, చైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఉదయం సేవలు

చిన్నశేషవాహనంపై గురువాయూరప్ప శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి భక్తులను కటాక్షించారు. ఏనుగులు, అశ్వాలు ముందు నడుస్తూ, భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనలతో వాహనసేవలు వైభవంగా సాగాయి.

ఇవాళ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు

  • ఉదయం 8 నుంచి 10 గంటల వరకు: సింహవాహనం

  • రాత్రి 7 నుంచి 9 గంటల వరకు: ముత్యపుపందిరి వాహనం

Follow us on , &

ఇవీ చదవండి