Breaking News

కందుకూరు పట్టణ అభివృద్ధికి రూ.26 కోట్లతో ప్రణాళికలు

సీఎం చంద్రబాబు నాయుడు పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఆ నిధుల వినియోగంపై సమావేశం.


Published on: 03 Apr 2025 23:35  IST

కందుకూరు పట్టణం, నెల్లూరు: జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. బుధవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నుడా వైస్‌చైర్మన్ సూర్యతేజ పాల్గొన్నారు.

కందుకూరు పట్టణ అభివృద్ధికి రూ.26 కోట్లతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరైన కలెక్టర్ ఆనంద్ ఇప్పటికే కొన్ని ప్రభుత్వ భూములను గుర్తించి, నుడాకు అప్పగించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ఇప్పటికే ఫిబ్రవరి 15న 'స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో పాల్గొనేందుకు కందుకూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఆ నిధుల వినియోగంపై సమావేశంలో చర్చించారు.

పట్టణంలోని ప్రధాన రహదారులు అయిన కోవూరు రోడ్డు, కనిగిరి రోడ్డు, ఓవీ రోడ్డు, పామూరు రోడ్ల విస్తరణ, కాలువల అభివృద్ధి, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు అంశాలపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీకి మే 1నాటికి 30 టన్నుల సామర్థ్యం గల కంపాక్టర్ వాహనం మంజూరు చేసి, పట్టణ వ్యర్థాలను దీని ద్వారా గుంటూరుకు తరలించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో డీటీసీపీ విద్యుల్లత, సీపీవో హిమబిందు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి