Breaking News

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంగా తల్లీకూతుళ్లపై కత్తితో దాడి

ప్రస్తుతం దివ్య గాయత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 48 గంటలు గడిస్తే గాని ఆమె పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పలేమని వైద్యులు చెప్పారు. 


Published on: 02 Apr 2025 17:44  IST

విశాఖలో ప్రేమోన్మాది ఉన్మాదం - తల్లీకూతుళ్లపై కత్తితో దాడి

విశాఖపట్నం, ఏప్రిల్ 2: మధురవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక ప్రేమోన్మాది అల్లరి సృష్టించాడు. ప్రేమను తిరస్కరించిందనే కోపంతో స్వయంకృషి నగర్‌లో బుధవారం మధ్యాహ్నం ఓ యువతిపై, ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటనలో తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు, యువతి దివ్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని నవీన్ అని గుర్తించారు.

నవీన్ కొంతకాలంగా దివ్యను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే, యువతి అతని ప్రేమను తిరస్కరించడంతో ఆక్రోశంతో ఇంటికి వెళ్లి తల్లీకూతుళ్లపై కత్తితో దాడి చేశాడు.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు,లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, నిందితుడు నవీన్‌పై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు

ప్రస్తుతం దివ్య గాయత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 48 గంటలు గడిస్తే గాని ఆమె పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పలేమని వైద్యులు చెప్పారు. ఈ ఘటనలో యువతి కూడా మరణించినట్లు వార్తలు రావడంతో దీనిపై ఏసీపీ అప్పలరాజు మాట్లాడుతూ.. యువతికి చికిత్స జరుగుతోందని చెప్పారు.

హోంమంత్రి స్పందన

ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ నగర పోలీస్ కమీషనర్ శంకబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు హోంమంత్రి. బాధితురాలు దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో స్వయంకృషి నగరంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు నిందితుడిని త్వరగా పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి