Breaking News

ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం.. ఈసీ కీలక ప్రకటన.ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ఓటర్‌ ఐడీ, ఆధార్‌ అనుసంధానంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో చర్చించారు.


Published on: 19 Mar 2025 14:56  IST

ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓటర్ ఐడీ మరియు ఆధార్ అనుసంధానంపై సమగ్రంగా చర్చించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశానికి ఈసీ సభ్యులు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, UIDAI సీఈవో, అలాగే ఎన్నికల కమిషన్‌కు చెందిన సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, ఓటు హక్కు భారతీయ పౌరులకు మాత్రమే పరిమితం కావాలని ఈ సమావేశంలో చర్చించారు. ఓటర్ల గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానించడం రాజ్యాంగ నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, అలాగే 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఉండాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియపై మరింత స్పష్టత కోసం UIDAI అధికారులతో త్వరలో సాంకేతిక చర్చలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఇక ఓటర్ల జాబితా నిర్వహణ, ఎన్నికల ప్రామాణికతపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే, ఏప్రిల్ 30, 2025లోగా, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, రాష్ట్రస్థాయి ప్రధాన ఎన్నికల అధికారుల ముందున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి, అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి