Breaking News

ఓలా, ఉబర్‌ల దోపిడికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.

డ్రైవర్లకు లాభాలు కలిగించేలా కొత్త తరహా యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు.


Published on: 27 Mar 2025 18:16  IST

పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో ఉద్యోగం చేసే వారికి వ్యక్తిగత వాహనం అవసరంగా మారింది. లేనిపక్షంలో బస్సుల్లో ప్రయాణించడం ఎంతో కష్టతరంగా ఉంటుంది. స్వంత వాహనం లేని వారు ప్రైవేట్ రవాణాపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ అవసరాన్ని గుర్తించి ఓలా, ఉబర్ వంటి యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కార్లు, బైకులు, ఆటోలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ సేవలను అందించే డ్రైవర్ల వద్ద నుంచి ఆయా కంపెనీలు భారీ మొత్తంలో కమీషన్ వసూలు చేస్తున్నాయి. దీని వల్ల డ్రైవర్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం "సహకార్ టాక్సీ" అనే కొత్త యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన ప్రకారం, ఈ సహకార్ టాక్సీ యాప్ కూడా ఓలా, ఉబర్‌ల తరహాలోనే టాక్సీ, ఆటో, బైక్ రైడ్ సేవలను అందించనుంది. కానీ, ఇందులో ప్రధాన తేడా ఏమిటంటే, ఈ యాప్ డ్రైవర్ల వద్ద నుంచి ఎటువంటి కమీషన్ వసూలు చేయదు. ప్రయాణ ఛార్జీ మొత్తాన్ని నేరుగా డ్రైవర్లకే చెల్లించే విధంగా రూపొందించబడింది. ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఈ కొత్త యాప్‌ను అభివృద్ధి చేసిందని అమిత్ షా వెల్లడించారు. "మా నినాదం సహకార్ సే సమృద్ధి. దీనిని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలియడంతో, ఓలా, ఉబర్ సంస్థలకు ఊహించని షాక్ తగిలినట్టైంది. ఈ కొత్త యాప్ డ్రైవర్లకు ఎలాంటి కమీషన్ లేకుండా, మరింత లాభదాయకంగా ఉండటంతో, భవిష్యత్తులో ప్రైవేట్ రైడ్-షేరింగ్ రంగంలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశముంది.

Follow us on , &

ఇవీ చదవండి