Breaking News

టోల్ గేట్లకు గుడ్‌బై.. జాతీయ రహదారులపై సరికొత్త టెక్నాలజీ.

దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను తీసుకువస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షణకు స్వస్తి పలికే అవకాశం ఉంది.


Published on: 21 Mar 2025 14:49  IST

జాతీయ రహదారుల్లో విప్లవాత్మక మార్పులు – టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యలకు ముగింపు

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో విప్లవాత్మక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. టోల్ గేట్ల వద్ద గంటల తరబడి నిలిచిపోవాల్సిన దుస్థితి త్వరలో మారనుంది. అంతేకాకుండా, టోల్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ కీలక విషయాలను వెల్లడించడంతో వాహనదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యలు, అధిక ఛార్జీల భారం వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఈ కొత్త విధానం ఊరటను అందించనుంది. టోల్ వసూళ్లలో పారదర్శకత, వేగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది.

త్వరలో సంవత్సరానికి రూ. 3,000 లేదా 15 సంవత్సరాలకు రూ. 30,000 ఒకేసారి చెల్లించేలా వార్షిక, జీవితకాల టోల్ ఫీజు విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది.దీనివల్ల ప్రభుత్వానికి నిరంతరాయంగా ఆదాయం వస్తుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు నిరీక్షించే సమయం ఆదా అవుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.

రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ శాటిలైట్ ఆధారిత టోలింగ్ విధానం గురించి కమిటీలు చర్చిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) మరియు FASTag సాంకేతికతలను ఉపయోగించి టోల్ వసూళ్లను మరింత సులభతరం చేయాలని నిపుణుల కమిటీలు సిఫారసు చేశాయని వెల్లడించారు.

ఈ  అధునాతన టెక్నాలజీ వల్ల వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా టోల్ ఛార్జీలు ఆటోమేటిక్‌గా వసూలు చేయవచ్చు. ఈ కొత్త మార్పుల ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఎదురయ్యే సమస్యలు తొలగిపోనున్నాయి. ప్రయాణం మరింత ఆసక్తికరంగా, వేగవంతంగా మారనుంది. 

Follow us on , &

ఇవీ చదవండి