Breaking News

47.6 డిగ్రీలతో భానుడి భగభగ.. 24 వరకు వడగాడ్పుల హెచ్చరిక..!

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, అనేక జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.


Published on: 21 May 2026 18:23  IST

24 వరకు కొనసాగనున్న ఎండల తీవ్రత

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వడగాడ్పులు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు వడగాడ్పులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. సాధారణ స్థాయికంటే 4 నుంచి 7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.

పిడుగురాళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత

ఈ వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నమోదైంది. అక్కడ 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.1 డిగ్రీలు, తణుకులో 46 డిగ్రీలు, కొల్లూరు మరియు తొర్రగుడిపాడులో 45.9 డిగ్రీలు నమోదయ్యాయి. ఆగిరిపల్లి, కొండపి, చిట్యాల, గూడూరు, కూనవరం వంటి ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

11 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా నమోదు

కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి. విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలో 23 మండలాలు, కృష్ణాలో 21, ప్రకాశం మరియు ఏలూరులో 20 చొప్పున, బాపట్లలో 17, నెల్లూరులో 16 మండలాలు తీవ్ర ఎండల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి.

ఈదురుగాలులతో అక్కడక్కడా వర్షాలు

అరేబియా సముద్రం నుంచి కేరళ, కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గురువారం కూడా రాష్ట్రంలోని 74 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 232 మండలాల్లో సాధారణ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, కొన్ని చోట్ల 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎండలతో భీతిల్లుతున్న ప్రజలు

ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పశ్చిమగోదావరి, పల్నాడు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మధ్యాహ్నానికి ముందే రహదారులు, మార్కెట్లు వెలవెలబోతున్నాయి. చాలామంది పగటి ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, వ్యాపారులు కూడా మధ్యాహ్నం సమయంలో దుకాణాలు మూసివేస్తున్నారు. ఎండల ప్రభావంతో ప్రజల దైనందిన జీవనం అస్తవ్యస్తమవుతోంది.

ఆకస్మిక వరదలపైనా హెచ్చరిక

ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ, మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మిక వరదల ప్రమాదం కూడా ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు వాతావరణ సూచనలను నిరంతరం పరిశీలిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సూచించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని చెప్పారు. తగినంత నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసాయం పొందాలని సూచించారు. వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు వైద్యశాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు

తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించింది. తాగునీటి సరఫరా, నీడ సదుపాయాలు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ప్రత్యేక మెమో జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి