Breaking News

అమెరికాలోని న్యూయార్క్ నగరం సెంట్రల్ పార్క్‌లో జరిగిన గుర్రపు బగ్గీ ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు రోమాంచ్‌ మహాజన్‌ మృతి

అమెరికాలోని న్యూయార్క్ నగరం సెంట్రల్ పార్క్‌లో జరిగిన గుర్రపు బగ్గీ (క్యారేజ్) ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు రోమాంచ్‌ మహాజన్‌ మరణించారు


Published on: 18 Jun 2026 11:45  IST

అమెరికాలోని న్యూయార్క్ నగరం సెంట్రల్ పార్క్‌లో జరిగిన గుర్రపు బగ్గీ (క్యారేజ్) ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు రోమాంచ్మహాజన్మరణించారు.భారత్ నుండి తన కుటుంబంతో కలిసి తొలిసారి న్యూయార్క్ పర్యటనకు వెళ్లిన రోమాంచ్‌ మహాజన్, బుధవారం మధ్యాహ్నం సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ షికారుకు వెళ్లారు.పర్యాటకులైన ఆ కుటుంబ సభ్యులను ఫొటో తీసేందుకు బగ్గీ నడిపే డ్రైవర్ కిందకు దిగాడు. ఆ సమయంలో గుర్రం ఒక్కసారిగా బెదిరిపోయి, నియంత్రణ లేకుండా వేగంగా పరుగులు తీసింది. డ్రైవర్ లేని ఆ బగ్గీ వేగంగా వెళ్తూ మరో బగ్గీ చక్రాన్ని ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది.

గుర్రం వేగంగా పరిగెడుతున్న సమయంలో ప్రమాదాన్ని గమనించిన రోమాంచ్‌ తల్లి ప్రియ బగ్గీ నుండి కింద పడిపోగా, ఆమెను రక్షించేందుకు రోమాంచ్‌ మహాజన్ కిందకు దూకాడు. ఆ సమయంలో అతడు ఒక్కసారిగా కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి.తీవ్రంగా గాయపడిన రోమాంచ్‌ను వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. బగ్గీలో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి.

రోమాంచ్‌ మహాజన్ ఇంటర్మీడియట్ (హైస్కూల్) పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విహారయాత్రను ప్లాన్ చేసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజే అతనికి మణిపాల్ యూనివర్సిటీ జైపూర్‌లో సీటు వచ్చినట్లు సమాచారం అందింది, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఫొటో తీయడానికి గుర్రాన్ని వదిలి కిందకు దిగిన డ్రైవర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.ఈ ఘోర ప్రమాదంతో న్యూయార్క్‌లో గుర్రపు బగ్గీల నిర్వహణను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్లు మరియు నిరసనలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి.

Follow us on , &

ఇవీ చదవండి