Breaking News

భారతీయ రైల్వేలోని AC కోచ్‌ల నుండి రూ. 104.51 కోట్ల విలువైన 1.27 కోట్లకు పైగా బెడ్‌రోల్ వస్తువులు చోరీ

భారతీయ రైల్వేలోని AC కోచ్‌ల నుండి రూ. 104.51 కోట్ల విలువైన 1.27 కోట్లకు పైగా బెడ్‌రోల్ వస్తువులు (దుప్పట్లు, తువ్వాళ్లు) చోరీకి గురైనట్లు సమాచార హక్కు చట్టం (RTI) దర్యాప్తు ద్వారా వెల్లడైంది.


Published on: 13 Jul 2026 18:16  IST

భారతీయ రైల్వేలోని AC కోచ్ నుండి రూ. 104.51 కోట్ల విలువైన 1.27 కోట్లకు పైగా బెడ్రోల్ వస్తువులు (దుప్పట్లు, తువ్వాళ్లు) చోరీకి గురైనట్లు సమాచార హక్కు చట్టం (RTI) దర్యాప్తు ద్వారా వెల్లడైంది.జనవరి 2022 నుండి మే 2026 మధ్య కాలంలో ప్రయాణికులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి ఈ వస్తువులను బ్యాగుల్లో సర్దేసుకున్నట్లు రైల్వే రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

రైల్వే శాఖ సేకరించిన రికార్డుల ప్రకారం అత్యధికంగా చిన్న తువ్వాళ్లు (ఫేస్ టవల్స్), దుప్పట్లు దొంగతనానికి గురయ్యాయి:

ఫేస్ టవల్స్ : 46.54 లక్షలు

బెడ్‌షీట్లు : 41.13 లక్షలు

పిల్లో కవర్లు : 23.59 లక్షలు

కంబళ్లు : 12.95 lakh

దిండ్లు : 2.76 లక్షలు

నివేదికలోని ముఖ్యాంశాలు

56% పెరిగిన దొంగతనాలు: 2022తో పోలిస్తే 2025 నాటికి ఈ లినెన్ వస్తువుల దొంగతనాలు 56 శాతం పెరిగాయి.

ప్రయాణికుల ప్రవర్తన: సగటున ప్రతి 1,000 మంది AC కోచ్ ప్రయాణికులలో ఒకరు కచ్చితంగా ఏదో ఒక బెడ్‌రోల్ వస్తువును దొంగిలిస్తున్నారు.

ఎక్కువగా నష్టపోయిన డివిజన్లు: దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం దొంగతనాలలో 67% కేవలం 10 రైల్వే డివిజన్లలోనే జరిగాయి. ఇందులో రాజస్థాన్‌కు చెందిన బికనీర్ డివిజన్ 25.76 లక్షల వస్తువుల చోరీతో మొదటి స్థానంలో ఉండగా, రాంచీ, ఢిల్లీ, ముంబై ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

జీతాల్లో కోత పడుతున్న అటెండెంట్లు

రైల్వే నిబంధనల ప్రకారం బెడ్‌రోల్స్ సరఫరా బాధ్యత ప్రైవేట్ కాంట్రాక్టర్లదే. వస్తువులు మాయమైతే ఆ నష్టాన్ని రైల్వే అధికారులు కాంట్రాక్టర్ల బిల్లుల నుండి రికవరీ చేస్తారు. దీనితో కాంట్రాక్టర్లు రోజుకు కేవలం ₹700 సంపాదించే కోచ్ అటెండెంట్ల జీతాల నుండి మొత్తాన్ని కట్ చేస్తున్నారు. ఒక్క బెడ్‌షీట్ పోతే అటెండెంట్ జీతం నుండి ₹300 వరకు రికవరీ చేస్తున్నట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే శాఖ తీసుకుంటున్న చర్యలు

ఈ సమస్యను అరికట్టడానికి భారతీయ రైల్వే ప్రయాణికుల్లో అవగాహన పెంచడంతో పాటు, నిఘా పెంచడానికి 'కోచ్ మిత్రా' యాప్ (Coach Mitra App), సీసీటీవీ కెమెరాలు మరియు వస్తువులకు ఆర్‌ఎఫ్ఐడీ (RFID Tags) ట్యాగ్‌లను అమర్చడం వంటి పద్ధతులను పరిశీలిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement