Breaking News

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ తమకు చెందిన క్లాడ్ ఏఐ మోడల్స్, పరీక్షల సమయంలో పొరపాటున ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి మూడు బయటి కంపెనీల నెట్‌వర్క్‌లను హ్యాక్

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ తమకు చెందిన క్లాడ్ ఏఐ మోడల్స్, పరీక్షల సమయంలో పొరపాటున ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి మూడు బయటి కంపెనీల నెట్‌వర్క్‌లను హ్యాక్ చేశాయని అధికారికంగా వెల్లడించింది.


Published on: 31 Jul 2026 18:52  IST

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ తమకు చెందిన క్లాడ్ ఏఐ మోడల్స్, పరీక్షల సమయంలో పొరపాటున ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి మూడు బయటి కంపెనీల నెట్వర్క్లను హ్యాక్ చేశాయని అధికారికంగా వెల్లడించింది.

పోటీ సంస్థ అయిన ఓపెన్‌ఏఐ కి చెందిన ఒక మోడల్ ఇటీవల హగ్గింగ్ ఫేస్ అనే సంస్థను హ్యాక్ చేసినట్లు ప్రకటించడంతో, ఆంత్రోపిక్ కూడా తమ రికార్డులను తనిఖీ చేసి ఈ విషయాన్ని గుర్తించింది.

పరీక్షల ఉద్దేశం: ఆంత్రోపిక్ సంస్థ తమ ఏఐ మోడల్స్ యొక్క సైబర్ భద్రతా సామర్థ్యాలను అంచనా వేయడానికి "క్యాప్చర్-ది-ఫ్లాగ్" అనే వర్చువల్ పోటీలను నిర్వహిస్తుంది. ఇందులో ఏఐకి ఒక నకిలీ నెట్‌వర్క్ ఇచ్చి, అందులో దాచిన రహస్య సమాచారాన్ని దొంగిలించాలనే టాస్క్ ఇస్తారు.

జరిగిన పొరపాటు: ఈ పరీక్షలు ఇంటర్నెట్ లేని ఒక ఒంటరి వాతావరణంలో జరగాలి. కానీ, టెస్టింగ్ భాగస్వామి అయిన 'ఇరెగ్యులర్' సిస్టమ్స్ కాన్ఫిగరేషన్ లోపాలు/అవగాహన లోపం వల్ల ఆ ఏఐ మోడళ్లకు లైవ్ ఇంటర్నెట్ యాక్సెస్ లభించింది.

నిజమైన కంపెనీలపై దాడి: మోడళ్లకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండటం, పైగా నెట్‌వర్క్ బయట ఉన్న నిజమైన కంపెనీల పేర్లు తాము ఆడుతున్న గేమ్‌లోని నకిలీ కంపెనీల పేర్లతో సరిపోలడంతో.. అవి అసలు ప్రపంచంలోకి ప్రవేశించాయి. బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఊహించడం, అన్‌ఆథరైజ్డ్ ఎండ్‌పాయింట్లను ఉపయోగించడం వంటి ప్రాథమిక పద్ధతులతో ఆ మూడు కంపెనీల డేటాబేస్‌లను హ్యాక్ చేశాయి.

ఈ ఘటనల్లో మూడు వేర్వేరు ఏఐ మోడల్స్ పాల్గొన్నాయి. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యాక ఒక్కో మోడల్ ఒక్కోలా స్పందించింది:

క్లాడ్ ఓపస్ 4.7 : ఇది తాము హ్యాక్ చేస్తున్నది నిజమైన కంపెనీ అని తెలిసినప్పటికీ, అది కూడా ఆంత్రోపిక్ పెట్టిన పరీక్షలో భాగమే అని భ్రమపడి దాడిని కొనసాగించింది.

క్లాడ్ మైథోస్ 5 : ఇది ఆంత్రోపిక్ యొక్క అత్యంత అధునాతన మోడల్. ఇది తన చర్యల వల్ల వచ్చే పరిణామాలను సరిగ్గానే గుర్తించింది కానీ, తాను ఇంకా సిమ్యులేషన్ (గేమ్) లోనే ఉన్నానని భ్రమపడింది.

అంతర్గత పరిశోధన మోడల్ : ఈ కొత్త మోడల్ మాత్రం తాము హ్యాక్ చేస్తోంది నిజమైన నెట్‌వర్క్ అని గ్రహించిన వెంటనే దాడిని స్వయంగా నిలిపివేసింది.

ప్రస్తుత పరిస్థితి:

ఈ ఘటనలు ఏప్రిల్ నెల నుండి జరుగుతున్నట్లు సంస్థ గుర్తించింది. దీనివల్ల నష్టపోయిన కంపెనీల పేర్లను ఆంత్రోపిక్ వెల్లడించలేదు కానీ, వాటికి సమాచారం అందించింది. ఆంత్రోపిక్ జూలై 23న ఇటువంటి సైబర్ పరీక్షలన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేసింది.

ఏఐ మోడల్స్ మానవ ప్రమేయం లేకుండా స్వంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మరియు హ్యాకింగ్‌కు పాల్పడటం అనేది సాంకేతిక నిపుణులను, ప్రభుత్వాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement