Breaking News

ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు వరుణయాగం

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి పై నేటి నుండి మూడు రోజుల పాటు త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.


Published on: 14 Aug 2026 12:39  IST

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి పై నేటి నుండి మూడు రోజుల పాటు త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లోకకల్యాణార్థం, ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న కరవు పరిస్థితులను నివారించి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, జలాశయాలు నిండాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ వరుణ యాగం ఆగస్టు 14 నుండి ఆగస్టు 16 (ఆదివారం) వరకు ఇంద్రకీలాద్రిపై గల పాత యాగశాల, అలాగే దుర్గాఘాట్ వేదికలుగా మూడు రోజుల పాటు జరుగుతుంది.

మూడు రోజుల వైదిక కార్యక్రమాల షెడ్యూల్:

మొదటి రోజు (ఆగస్టు 14): ఉదయం 9 గంటల నుంచి పాత యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, మండపారాధనతో పాటు వరుణ, ఋష్యశృంగ, నవగ్రహ, అష్టదిక్పాలకులకు పురుషసూక్త విధానపూర్వక పూజలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు కృష్ణా నదిలోకి దిగి ప్రత్యేక వరుణ అనువాక పారాయణాలు, జపాలు నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు గణపతి, ఇంద్ర, వరుణ, ఋష్యశృంగ మండప దేవతా ఆవాహనలు, పూజలు జరుగుతాయి.

రెండో రోజు (ఆగస్టు 15): ఉదయం 6:30 నుండి 8:30 గంటల వరకు దుర్గాఘాట్‌లో వరుణ అనువాక కార్యక్రమం, మండప పూజ నిర్వహిస్తారు. అనంతరం పాత యాగశాలలో రుద్ర హోమం మరియు ఇతర విశేష హోమాలను జరుపుతారు.

మూడో రోజు (ఆగస్టు 16): చివరి రోజు ఉదయం దుర్గాఘాట్ వద్ద కృష్ణా నది నుండి పవిత్ర జలాలను సేకరిస్తారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాన్యాసపూర్వక పారాయణం, ఘటాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10:30 గంటలకు పాత యాగశాలలో మహా పూర్ణాహుతితో ఈ వరుణ యాగం ముగుస్తుంది.

 

Follow us on , &

ఇవీ చదవండి