Breaking News

నల్సార్ లా యూనివర్సిటీ 2026 బ్యాచ్ విద్యార్థులపై విధించిన ఎన్‌రోల్‌మెంట్ నిషేధాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని గంటల్లోనే పూర్తిగా ఉపసంహరించుకుంది.

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ (NALSAR) లా యూనివర్సిటీ 2026 బ్యాచ్ విద్యార్థులపై విధించిన ఎన్‌రోల్‌మెంట్ నిషేధాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) కొన్ని గంటల్లోనే పూర్తిగా ఉపసంహరించుకుంది.


Published on: 14 Aug 2026 19:04  IST

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ (NALSAR) లా యూనివర్సిటీ 2026 బ్యాచ్ విద్యార్థులపై విధించిన ఎన్‌రోల్‌మెంట్ నిషేధాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) కొన్ని గంటల్లోనే పూర్తిగా ఉపసంహరించుకుంది. దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులు, సోషల్ మీడియా నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో బీసీఐ తన పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ యూ-టర్న్ తీసుకుంది. దీనివల్ల విద్యార్థులందరూ తాము కోరుకున్న రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్లుగా నమోదు చేసుకోవడానికి మార్గం సుగమమైంది.

వివాదానికి అసలు కారణం

సీజేఐ ఆహ్వానానికి వ్యతిరేకత: నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి (Convocation) భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని 2026 బ్యాచ్‌కు చెందిన దాదాపు 450 మంది విద్యార్థులు వ్యతిరేకించారు.

విద్యార్థుల లేఖ: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేసిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన కొన్ని వ్యాఖ్యలపై నల్సార్ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడానికి తమ మనసాక్షి ఒప్పుకోవడం లేదంటూ వర్సిటీ వీసీకి లేఖ రాశారు.

విద్యార్థుల చర్యను క్రమశిక్షణా రాహిత్యంగా భావించిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, నల్సార్ 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లు ఎవరూ అడ్వకేట్లుగా నమోదు కాకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు ఇచ్చారు.

అత్యున్నత న్యాయస్థానం పట్ల గౌరవం లేనివారు న్యాయవాద వృత్తికి పనికిరారని బీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిషేధం ఎందుకు తొలిగించారు

తీవ్ర వ్యతిరేకత: ఒకరిద్దరి చర్యల వల్ల బ్యాచ్ మొత్తాన్ని నిషేధించడంపై సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ సింగ్, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వంటి ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఇది విద్యార్థుల ప్రాథమిక హక్కు అయిన భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని తప్పుబట్టారు.

నిర్ణయం వెనక్కి: తీవ్ర ఒత్తిడి మరియు వ్యతిరేకత రావడంతో బీసీఐ సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. మెజారిటీ విద్యార్థులు అమాయకులని, కొందరి వల్ల మిగతా వారు నష్టపోకూడదని భావిస్తూ విధించిన నిషేధాన్ని మరియు విద్యార్థులపై ప్రారంభించిన అన్ని చర్యలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బీసీఐ ప్రకటించింది. కొందరు అధ్యాపకులు, బయటి వ్యక్తులు విద్యార్థులను రెచ్చగొట్టారని బీసీఐ పేర్కొంది.

 

Follow us on , &

ఇవీ చదవండి