Breaking News

ఆబ్కారీ శాఖ సిబ్బందికి ఆయుధాలు

తెలంగాణ ఆబ్కారీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి, అధికారులకు ఆయుధాలు సమకూర్చే అంశంపై ప్రభుత్వం కీలక కసరత్తు చేస్తోంది. 2026 సెప్టెంబర్ 28, సోమవారం నాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు.


Published on: 29 Sep 2026 17:15  IST

తెలంగాణ ఆబ్కారీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి, అధికారులకు ఆయుధాలు సమకూర్చే అంశంపై ప్రభుత్వం కీలక కసరత్తు చేస్తోంది. 2026 సెప్టెంబర్ 28, సోమవారం నాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. డ్రగ్స్, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL), మరియు సారా అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు దాడులు చేస్తున్న సమయంలో నిందితుల నుంచి ఎదురవుతున్న దాడుల నేపథ్యంలో, సిబ్బంది ఆత్మరక్షణ మరియు భద్రత కోసం ఆయుధాలు ఇవ్వాలని శాఖ భావిస్తోంది.

అధికారుల అభిప్రాయాల సేకరణ

ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించేందుకు గాను, ప్రాథమికంగా ఏ ఏ స్థాయి అధికారులకు వెపన్లు కేటాయించాలనే అంశంపై కమిషనర్ క్షేత్రస్థాయి అధికారుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లలో పాల్గొనే స్టేట్ టాస్క్‌ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ విభాగాలకు తొలి ప్రాధాన్యతగా ఇవ్వాలా?

లేదా సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CI), ఎక్సైజ్ సూపరింటెండెంట్లు (ES) స్థాయి వరకు ఆయుధాలు అందించాలా? అనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

పోలీసు శాఖతో సమన్వయం , ప్రత్యేక శిక్షణ

ఒకవేళ ప్రభుత్వం ఈ ఆయుధాల మంజూరుకు అనుమతి ఇస్తే, ఎక్సైజ్ సిబ్బంది పోలీసు శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆయుధాల నిర్వహణ, ఫైరింగ్ రూల్స్, ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించే అంశాన్ని కూడా ఈ ప్రతిపాదనల్లో చేర్చనున్నారు.

పెరిగిన దాడులు - కేసుల నమోదు

గత జూలై, ఆగస్టు నెలల్లోనే ఎక్సైజ్ శాఖ దాదాపు 3,000లకు పైగా కేసులు నమోదు చేసి, 2,700 మందికి పైగా నిందితులను అరెస్టు చేసింది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాపై నిఘా పెంచినందున, క్షేత్రస్థాయి సిబ్బందికి రక్షణ తప్పనిసరైంది. ప్రస్తుతం ఈ ఆయుధాల కేటాయింపు ప్రతిపాదన కేవలం అభిప్రాయాల సేకరణ మరియు ప్రాథమిక ముసాయిదా దశలోనే ఉంది.

ఇతర ఆదేశాలు

ఇదే సమావేశంలో డ్రగ్స్ (NDPS) కేసులపై నిఘా తీవ్రతరం చేయాలని, బార్లు మరియు వైన్ షాపుల నుంచి ఎక్సైజ్ అద్దె బకాయిలను త్వరగా వసూలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే నూతన బార్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తగిన మార్గదర్శకత్వం అందించాలని అధికారులను కోరారు.ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషీ, జాయింట్ కమిషనర్ జి. అంజన్‌రావు, మరియు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి