Breaking News

నవ మాసాలు మోసి కనిపెంచిన కన్న తల్లి ని నడిరోడ్డుపై వదిలేసిన ఐదుగురు కుమారులు

90 సంవత్సరాల వృద్ధురాలు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఆవరణలో వదిలేసిన మనుమడు - గత 10 రోజుల నుంచి తనవారి కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు


Published on: 09 Apr 2025 15:02  IST

తన బిడ్డల కోసం జీవితంలో ఎన్నో త్యాగాలు చేసిన ఓ 90 ఏళ్ల తల్లిని కన్న కొడుకులే నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయారు,ఈ వయసులో ఆ తల్లి పడే బాధను చూసిన అందరి హృదయాలు బరువెక్కాయి.ఇప్పుడు ఆ తల్లి తన కన్న కొడుకులే తనను నడిరోడ్డుపై విడిచిపెట్టిన బాధతో గాంధీ ఆసుపత్రి ఆవరణలో కొడుకుల కోసం ఎదురుచూస్తుంది.

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి సమీపంలో 90 ఏళ్ల వృద్ధురాలు కూర్చుని, ప్రతి ఒక్కరినీ ఆశగా చూస్తోంది. ఎవరు తన కొడుకులై ఉంటారా? తన మనుమడు తిరిగి వస్తాడా? అనే ఆశలతో ఎదురుచూస్తోంది. పదిరోజులుగా అక్కడే ఉంటూ, ఎవరైనా తనను గుర్తిస్తారో అనే తపనతో ఎదురుచూస్తోంది.

మంగళవారం ఆమెను గమనించిన కొందరు ముందుకు వచ్చి మాట్లాడగా, ఆమె పేరు కాశమ్మ అని తెలిపింది. తన స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అని చెప్పింది. తనకు ఐదుగురు కొడుకులున్నరని చెప్పారు.ఎందుకో తెల్వదు తన మనుమడు ఈడ వదిలేసిండని, ఎంతకూ తిరిగొస్తలేడని, తనను పుట్టించిన ఆ దేవుడైనా పిలుస్తలేడని తడబడుతూ ఒక్కో మాటను కష్టంగా కన్నీటి మాటల్లో చెప్పింది.

ఆ వృద్ధురాలి పరిస్థితి చూసిన స్థానికులు ఆమెకు తినడానికి అన్నం, నీళ్లు అందించారు. ఆమెను చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టారు. “ఈ తల్లి కన్నపిల్లలు ఎక్కడ ఉన్నా వచ్చి తీసుకెళితే బాగుండని స్థానికులు కోరుకుంటూ ఉన్నారు.

ఈ ఘటనపై అధికారులు స్పందించారు. కాశమ్మను గాంధీ ఆసుపత్రిలో చికిత్సకు చేర్చించి, తాము ఉన్నామంటూ భరోసా కల్పించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆమెను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ గారు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి