Breaking News

ఆ చిన్నారి తరగతి బయటే కూర్చుని పరీక్ష రాసే అంత తప్పు ఏం చేసింది?

తమ సహ విద్యార్థులతో కూర్చుని రాయాల్సిన పరీక్షను ఆ చిన్నారి తరగతి బయటే కూర్చుని రాసే అంత తప్పు ఏం చేసింది?


Published on: 10 Apr 2025 14:55  IST

తమ సహ విద్యార్థులు అందరూ తరగతిలో కూర్చుని పరీక్ష రాస్తుంటే, ఓ చిన్నారి మాత్రం బయట ఒక్కతే కూర్చుని పరీక్ష రాసింది. ఎందుకంటే పీరియడ్స్‌ వచ్చిందన్న ఒక్క కారణంతో  ఆ చిన్నారిని బయట కూర్చోపెట్టి పరీక్ష రాయించారు,నొప్పితో పాటు అవమానాన్ని భరిస్తూ బయట కూర్చుని పరీక్ష రాసింది ఆ చిన్నారి ఇంత అమానుష సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని సెంగుట్టై అనే ప్రైవేట్ స్కూల్‌లో వెలుగు చూసింది.

8వ తరగతిలో చదువుతున్న ఆ చిన్నారి పరీక్షల సమయంలో స్కూల్‌కి వచ్చింది. అదే సమయంలో ఆమెకు రుతుక్రమం మొదలైంది. ఈ విషయాన్ని  ప్రిన్సిపాల్‌కి చెప్పింది. అయితే సహాయం చేయాల్సిన వ్యక్తి ఆ చిన్నారిని క్లాస్‌ రూమ్‌లోకి రానివ్వకుండా బయటే కూర్చోబెట్టింది. పైగా అక్కడే కూర్చొని పరీక్ష రాయమని చెప్పింది.

ఈ వ్యవహారంతో చిన్నారి తీవ్ర మనస్తాపానికి లోనైంది. అయినప్పటికీ ధైర్యంగా నొప్పితో పాటు అవమానాన్ని భరిస్తూ బయట కూర్చొని పరీక్ష రాసింది. కుమార్తె క్లాస్ బయట ఉండటం చూసి ఆమె తల్లి, ఏమైందని అడిగినపుడు, కుమార్తె జరిగిన అన్ని విషయాలు చెప్పింది. వెంటనే తల్లి తీవ్రంగా స్పందించి ఇంత అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ తల్లి. స్కూల్లో ఇంత అరాచకంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించింది.

ఇటువంటి పరిస్థితులు విద్యా సంస్థలలో చోటుచేసుకోవడం బాధాకరం. పీరియడ్స్ అనేది సహజ శరీర ప్రక్రియ. దీన్ని వివక్షతో చూడటం వల్ల పాఠశాలలే చిన్నారులకు భయం కలిగించే ప్రదేశాలుగా మారుతున్నాయి. ఈ సంఘటన మరోసారి మన సమాజంలో ఇంకా పీరియడ్స్‌పై అవగాహన ఎంత తక్కువగా ఉందో చాటింది.

Follow us on , &

ఇవీ చదవండి