Breaking News

కల్తీ కల్లు వెనుక లీడర్లు, అధికారులు..! ఎక్సైజ్, పోలీసులు సైతం కుమ్మక్కు?

రాష్ట్రంలో కల్తీ కల్లు మాఫియా వెనుక లోకల్ లీడర్లు, ఎక్సైజ్ అధికారులు, పోలీసుల పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి.


Published on: 11 Jul 2025 08:05  IST

తెలంగాణలో కల్తీ కల్లు మాఫియా వృద్ధిపొందుతున్నదన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ మాఫియా చుట్టూ ప్రభుత్వ యంత్రాంగంలోని కొన్ని వర్గాలు, స్థానిక రాజకీయ నాయకుల మద్దతు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మత్తు కలిగించే పదార్థాలైన ఆల్ఫ్రోజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రెడ్ వంటివి కల్తీ కల్లు తయారీకి విస్తృతంగా వాడుతుండగా, వీటి సరఫరాను పూర్తిగా అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందన్న విమర్శలు వచ్చాయి.

వీటి తయారీ కేంద్రాల నుంచి డెలివరీ వరకు సజావుగా జరిగే వ్యవస్థ ఏర్పడిందని, ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే, వారి మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఉందని ప్రజలు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ మాఫియా వాటితో స్నేహం పెంచుకోవడం, స్థానిక నేతల అవసరాలను తీర్చడం ద్వారా రక్షణ కల్పించించుకుంటున్నాయని ప్రచారం జరుగుతోంది.

అధికార పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాల వల్ల, ఎక్సైజ్, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోకుండానే వదిలేస్తున్నాయన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దానికి బదులుగా, సంబంధిత అధికారులకు నెలవారీగా మామూలు కమీషన్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నవే. ఇది జరిగే క్రమంలో కల్తీ కల్లు వ్యాపారం ఆగకుండా కొనసాగుతోందని భావిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్‌ బాలానగర్‌లో జరిగిన కల్తీ కల్లు ఘటన ఈ సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఘటన తర్వాత నిఘా సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా కల్తీ కల్లు మాఫియాపై సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో మత్తుపదార్థాల కొంత భాగం లోకల్‌గా తయారవుతుండగా, మరికొన్ని పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్నాయి. వీటి ట్రాన్స్‌పోర్టు, పంపిణీ వెనుక ఉన్న ముఠాలు బహిరంగ రహస్యంగా మారాయని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు ఈ ముఠాలను పట్టించుకోకపోవడంపై అసంతృప్తి పెరుగుతోంది. ఒక ఘటన జరిగిన వెంటనే కొంతకాలం చర్యలు తీసుకుని, తర్వాత మళ్లీ మౌనం పాటించడమే పరిపాటి అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాలానగర్ ఘటనలో అధికారికంగా ఎవరూ మరణించలేదని అధికారులు చెబుతున్నా, ప్రజల్లో అనేకమంది చనిపోయినట్లు ప్రచారం, పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఉంది. ఈ ఘటనకు ఇప్పటికీ బాధ్యులుగా ఎవరినీ గుర్తించకపోవడం, స్థానిక ఎక్సైజ్ అధికారుల వైఖరిపై అనుమానాలు తలెత్తించాయి. ఇది నిజంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమా? లేదా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ప్రభుత్వం దీనిపై ఎంతవరకు సీరియస్‌గా స్పందిస్తుంది? మాఫియా గూళ్లను నిజంగా తొలగిస్తుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉదయిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి