

వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరలను నియమించొద్దంటూ ఆదేశాలు...
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కౌన్సిల్లో ముస్లిమేతరలను నియమించొద్దంటూ ఆదేశాలు!
Published on: 17 Apr 2025 17:15 IST
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టు విచారణ – కేంద్రానికి వారం గడువు
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీం కోర్టు రెండో రోజు విచారణ కొనసాగించింది. ఈ కేసులో స్పందన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సమయం కోరగా, న్యాయస్థానం అంగీకించింది. అప్పటి వరకు వక్ఫ్ చట్టానికి సంబంధించిన నిబంధనలు యథాతథంగా కొనసాగాలని ఆదేశించింది.అలాగే, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను అప్పటి వరకు కొత్తగా నియమించకూడదని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ మే 5వ తేదీకి వాయిదా వేసింది.
ఇక పిటిషన్లు దాఖలైన నేపథ్యం విషయానికి వస్తే – వక్ఫ్ సవరణ చట్టంపై విస్తృతంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్ తో సహా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన నిరసనల నేపథ్యంలో కొంత అల్లర్లూ చోటు చేసుకున్నాయని కోర్టు పేర్కొంది. దీనితో పాటు, "హిందూ మతాలకు సంబంధించిన బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా?" అని ప్రశ్నించింది.
ప్రస్తుతం కోర్టులు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను వక్ఫ్ జాబితా నుంచి తొలగించరాదని, అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యుల నియామకంపై కొంత స్పష్టత అవసరమని కోర్టు సూచించింది. ఎక్స్-అఫీషియో సభ్యుల విషయమైతే మతాన్ని బట్టి కాకుండా నియమించొచ్చని కోర్టు అభిప్రాయపడింది.
ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు సూచనలపై అంగీకారం తెలిపారు. దీంతో, సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.