Breaking News

నేడు తెలంగాణ కేబినెట్ మీటింగ్.. కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే చాన్స్!

నేడు తెలంగాణ కేబినెట్ మీటింగ్.. కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే చాన్స్!


Published on: 25 Jul 2025 09:14  IST

ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన రాగానే సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు హాజరుకాబోతున్నారు. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి రెండు రోజుల క్రితమే సీఎస్ అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీచేసి, తమ శాఖలకు సంబంధించిన అంశాలను సాధారణ పరిపాలన విభాగానికి పంపించాలని సూచించారు.

ఈ సమావేశంలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఉన్న అనేక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా కులగణన నివేదికపై కీలక చర్చ జరుగుతుందని సమాచారం. ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బీసీ ఆర్డినెన్స్‌ను న్యాయసలహా కోసం ఢిల్లీకి పంపిన నేపథ్యంలో ఆ పరిణామాలపై కేబినెట్ స్థాయిలో సమీక్ష చేయనున్నారు. దీనికితోడు గోశాలల నిర్వహణ విధానంపై కూడా ఈ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

రాష్ట్రంలోని ఖాళీ పోస్టుల భర్తీపై కూడా ఈ సమావేశంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. యువతలో నిరుద్యోగత సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపవచ్చని సమాచారం. మరోవైపు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో యూరియా ఎరువుల డిమాండ్, సరఫరాపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించనుంది. రైతులకు ఎరువులు సరైన సమయంలో అందేలా చర్యలు తీసుకోవడంపై చర్చ జరుగుతుందని అంచనా.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. వివిధ జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉన్న పురోగతి, నిధుల వినియోగంపై సమీక్ష జరగనుంది. నిధుల అందుబాటును మెరుగుపరిచి, గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్న దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ కేబినెట్ భేటీ ద్వారా రాష్ట్ర పాలనకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం తీసుకునే రాజకీయ, పరిపాలనా నిర్ణయాలు రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి