Breaking News

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే 40 వేల ఖాళీ ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఓయూలో కొత్త హాస్టల్ భవనాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నూట రోజుల్లోనే 55,000 ఉద్యోగాలను కల్పించామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని రేవంత్ విమర్శించారు. తమ ప్రభుత్వం ఓయూ అభివృద్ధికి కట్టుబడి ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.


Published on: 26 Aug 2025 09:46  IST

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గత బీఆర్ఎస్ పాలనలో పరీక్షలు పూర్తయి ఫలితాలు ప్రకటించిన నియామకాలకు సంబంధించిన కాల్ లెటర్స్ జారీ చేసింది. ఆతర్వాత నోటిఫికేషన్ల జాడే లేదు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారీగా ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు.. సర్కార్ తీరు ఏమాత్రం నచ్చడం లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆ వివరాలు.

ఉస్మానియా యూనివర్శిటీలో రూ.80 కోట్లతో నిర్మించిన హస్టల్ భవనాలను ప్రారంభించేందుకుగాను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూలో అడుగుపెట్టారు. హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలు గుర్తించి దాదాపు 40 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 55 వేల నియామకాలు పూర్తి చేశామని సీఎం రేవంత్ వెల్లడించారు. 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు.

రేవంత్ మాట్లాడుతూ. గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. గతంలో విద్యార్థులు చదువుకుంటామంటే.. అప్పటి ప్రభుత్వం వారికి గొర్లు, బర్లు, చేపల రుణాలిప్పిస్తామంటూ వారిని మోసం చేసింది. వీరంతా తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు వంటి వారు. కానీ మా పార్టీ ఇందుకు విరుద్ధం. మా సర్కార్.. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బాగా చదువుకుని.. ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశిస్తుంది. విద్యార్థులు దీన్ని గుర్తించాలి. ఇక విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సమస్యలున్నా తెలియజేయండి. వాటిని వెంటనే పరిష్కరించే బాధ్యత నాది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి